Shivamurthy Murugha Sharanaru Arrested : కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు వెల్లడించారు కర్ణాటక శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ అలోక్ కుమార్. అనంతరం వైద్యపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత జిల్లా సెషన్స్ జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరుపరిచామని తెలిపారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని, చిత్రదుర్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించామని చెప్పారు.
అసలేం జరిగందంటే?.. కర్ణాటక చెందిన ఇద్దరు బాలికలు మైసూరులోని ఒక స్వచ్ఛంద సంస్థ వద్దకు వెళ్లి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి అక్కడి అధికారులకు వివరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మురుగ మఠాధిపతిని అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల మురుగ మఠాధిపతిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు నేపథ్యంలో చిత్రదుర్గలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలు కుట్రలో భాగమని, తాను చట్టానికి కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తానని మురుగ మఠాధిపతి తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను స్థానిక కోర్టు సెప్టెంబరు 2కు వాయిదా వేసింది.