Muruga Mutt Swamiji Case : కర్ణాటకలోని మఠాధిపతి శివమూర్తి మురుగ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అసలు వారిపై లైంగిక దాడి జరగలేదని తేలినట్లు సమాచారం. బాలికల వైద్య పరీక్షల నివేదిక తాజాగా బయటికొచ్చింది.
స్వామీజీ శివమూర్తి 2019 నుంచి 2022 వరకు తమను లైంగికంగా వేధించినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించిన నేపథ్యంలో శివమూర్తిపై ఆగస్టు 26న మైసూరులో కేసు నమోదైంది. అనంతరం కేసును చిత్రదుర్గ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేగడం వల్ల పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, కేసు నమోదు చేసిన తర్వాత బాధిత బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికను తాజాగా ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.
బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో కన్పించలేదని, జననాంగాలకు ఎలాంటి గాయాలు కాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. స్వామిజీ శివమూర్తిపై మరో నలుగురు బాలికలు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అయితే వారి వైద్య పరీక్షల నివేదికలు ఇంకా బయటకు రాలేదు. మఠ్ వసతిగృహాల్లో ఉంటున్న బాలికలకు మత్తుమందులు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత లైంగికంగా హింసించేవారని శివమూర్తిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. శివమూర్తి మురుగకు దేశంలోని ప్రముఖులతో పరిచయాలున్నాయి.
ఇవీ చదవండి: 'చెకింగ్ సమయంలో మహిళ షర్ట్ తొలగించాలన్న విమానాశ్రయ అధికారులు!'
డెలివరీ చేసి కడుపులో టవల్ వదిలేసిన వైద్యుడు.. ఐదు రోజుల తర్వాత మరో ఆపరేషన్