రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలీబాగ్ పోలీసు బృందం అర్నబ్ గోస్వామిని తన ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని అర్నబ్ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. తనపైనా భౌతిక దాడులకు పాల్పడ్డారని చెప్పారు.
'ఎమర్జెన్సీ గుర్తొస్తోంది'
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అర్నబ్ గోస్వామి అరెస్టును ఖండించారు. అర్నబ్ అరెస్టును వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్యానికి నాలుగో పునాదిపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అవమానించాయని మండిపడ్డారు. అర్నబ్‌ను అరెస్టు చేయడమంటే రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు.
అర్నబ్ అరెస్టును కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఖండించారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని దుయ్యబట్టారు. ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు.
తమను వ్యతిరేకించే వారి నోరు మూయించడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నమే ఇది అని ధ్వజమెత్తారు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ మహారాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.
ఇదీ కేసు!
2018లో అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్ తన తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అర్నబ్‌కు చెందిన రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
అన్వయ్ కుమార్తె ఆద్న్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసుపై పునర్విచారణ ప్రారంభించినట్లు ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. రిపబ్లిక్ టీవీ బకాయిల చెల్లింపుపై ఇదివరకు అలీబాగ్ పోలీసులు విచారణ చేపట్టలేదని.. అందువల్లే తన తండ్రి, నానమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆద్న్యా ఆరోపించినట్లు దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.