Stomach Smuggling: మహారాష్ట్ర ముంబయి విమానాశ్రయంలో చేపట్టిన తనిఖీల్లో ఉగాండాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 690 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ గురించి డీఆర్‌ఐ అధికారులకు అందిన సమాచారం ఆధారంగా .. ఇథియోపియా నుంచి వచ్చిన బ్రండన్ మిగాడే అనే వ్యక్తిపై అనుమానంతో తనిఖీలు నిర్వహించారు.
కోర్టు నుంచి ముందస్తు అనుమతితో అతడిని వైద్య పరీక్షలకు పంపారు. ఎక్స్-రే స్క్రీనింగ్, సోనోగ్రఫీ వంటి వైద్య పరీక్షలు జరిపిన తర్వాత.. ఆ వ్యక్తి తన కడుపులో కొకైన్ మాత్రలను దాచుకున్నట్లు తేలింది. ముంబయిలోని జేజే ఆసుపత్రి వైద్యులు నిందితుడి కడుపు నుంచి 70 మాత్రలను బయటకు తీశారు. అనంతరం పోలీసులు అతడిని కస్టడీకి తరలించారు.
Animal Smuggling: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గత రెండు రోజుల్లో థాయ్‌లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికులను పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా.. అధికారులు ఆదివారం.. బ్యాంకాక్ నుంచి చెన్నై వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి బ్యాగులో అల్బినో పొర్కుపైన్ (albino porcupine), కోతి (white lipped red chested tamarin) వంటి అరుదైన వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం మరోసారి జరిగిన తనిఖీల్లో.. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి కంటైనర్‌లో దాచిన లూసిస్టిక్ షుగర్ గ్లైడర్‌ను (leucistic sugar glider) అధికారులు రక్షించారు. అయితే ఈ రెండు సందర్భాల్లో.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న వ్యక్తికి ఇవ్వమని కోరుతూ తమకు బ్యాగులను ఇచ్చారని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. యానిమల్ క్వారంటైన్ అధికారుల సలహా మేరకు జంతువులను తిరిగి థాయ్‌లాండ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా.. కారణమిదే!