Poverty index India : 2021 మార్చి నాటికి గడిచిన ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ వెల్లడించింది. వీరి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొంది. ఉత్తర్ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వృద్ధి గణనీయంగా ఉందని వివరించింది. సోమవారం 'నేషనల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్'(MPI)ను ప్రకటించిన నీతి ఆయోగ్.. అందులో ఈ వివరాలను వెల్లడించింది. నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ సుమన్ బెరీ ఈ నివేదికను విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం.. 2015-16లో 24.85 శాతంగా ఉన్న పేదలు.. 2019-2021 నాటికి 14.96 శాతానికి తగ్గారు. మొత్తంగా ఈ ఐదేళ్లలో 9.89 శాతం మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక క్షీణత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ ఐదేళ్లలో గ్రామీణ పేదల సంఖ్య 32.59 శాతం నుంచి 19.28 శాతానికి దిగొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది. ప్రజల విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది నీతి ఆయోగ్. వీటిలో పోషకాహారం, పిల్లలు వారి కౌమారదశ మరణాలు, తల్లి ఆరోగ్యం, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు, బ్యాంకు ఖాతాల వంటి 12 సూచికలు ఉన్నాయి.
పారిశుద్ధ్యం, పోషణ, వంట ఇంధనం, తాగునీరు, విద్యుత్, ప్రజలను ఆర్థికంగా మెరుగుపరచడం వంటి వాటిపై.. అంకితభావంతో ప్రభుత్వం పనిచేయడం వల్లే పేదరికం ఈ స్థాయిలో తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. పోషన్ అభియాన్, అనీమియా ముక్త్ భారత్ వంటి పథకాలు పేదలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడ్డాయని వివరించింది. స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్ పథకాలు దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచాయని పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా సబ్సిడీతో కూడిన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా పేదల జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ తెలిపింది. వీటితో పాటు మిగతా సంక్షేమ పథకాలు దేశ ప్రజలను పేదరికం నుంచి బయటపడేశాయని వెల్లడించింది.