MS Swaminathan Passed Away : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు.. చెన్నైలోని తన నివాసంలో గురువారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు.. స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలను ఆయన సృష్టించారు.
మోదీ సంతాపం..
MS Swaminathan Death : ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్‌తో దిగిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసి సంతాపం తెలిపారు. "డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మన దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు.. వ్యవసాయంలో ఆయన చేసిన సంచలనాత్మక కృషి లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. దేశానికి ఆహార భద్రతను కల్పించింది" అని ఆయన సేవలను మోదీ కొనియాడారు.
'వారసత్వాన్ని అక్కాచెల్లెళ్లం కొనసాగిస్తాం'
MS Swaminathan News : తన తండ్రికి గతకొద్దిరోజులాగా ఆరోగ్యం బాగాలేదని.. గురువారం ఉదయం కన్నుమూశారని WHO మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్య తెలిపారు. "నాన్న.. చివరి క్షణం వరకు రైతుల సంక్షేమం కోసం, సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. మా తల్లిదండ్రుల వారసత్వాన్ని మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం కొనసాగిస్తాం. వ్యవసాయంలో మహిళలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని గుర్తించిన అతికొద్ది మందిలో మా నాన్న ఒకరు. మహిళా సాధికారత కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు" అని తెలిపారు.
వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగానికి..
MS Swaminathan Biography : స్వామినాథన్ 1925 ఆగస్టు7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో చదివారు. తరువాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్ 1943 నాటి భయంకరమైన బంగాల్ కరవును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలిని నుంచి కాపాడాలనే లక్ష్యంతో వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.
1954లో భారత్‌కు తిరిగి వచ్చి..
MS Swaminathan Education : 1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో నుంచి సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో.. బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. సోలానమ్ విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో ఆయన విజయం సాధించారు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి పీహెచ్డీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి.. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేపట్టారు.
వరి, గోధుమ మొదలైన పంటలపై..
MS Swaminathan Inventions : వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.
ఎన్నో పదవులను..
About MS Swaminathan in Telugu : స్వామినాథన్ ఎన్నోపదవులను సమర్ధంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరక్టర్‌గా పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టర్ జనరల్‌గా సేవలనందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో ఆయన పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది.
దేశ అత్యుత్తమ పురస్కారాలను..
MS Swaminathan Award List : వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యుత్తమ పురస్కారాలను అందించింది. 1989లో పద్మవిభూషణ్ అవార్డును ఆయన అందుకున్నారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. 1971లో రామన్ మెగసెసే అవార్డును ఆయన అందుకున్నారు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు స్వామినాథన్‌ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు.