MP Prajwal Revanna Election Declared Null : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నకు రాజకీయంగా గట్టి షాక్ తగిలింది. హసన్ ఎంపీగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది కర్ణాటక హైకోర్టు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం సమర్పించారనే కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఎన్నికల నియమావళి కోడ్ 19 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కు సూచించింది. వీరితో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్న, సోదరుడు సూరజ్ రేవణ్నపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నియోజకవర్గానికి చెందిన జి. దేవరాజగౌడ అనే ఓటర్‌తో పాటు రేవణ్నపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎ. మంజు పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నటరాజ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని తేలిన నేపథ్యంలో తనను ఎంపీగా గుర్తించాలని బీజేపీ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్ మంజు సైతం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
2019 Hassan MP Election Result : అంతకుముందు 2019 ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎ.మంజు.. ప్రజ్వల్ రేవణ్నపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి గెలిచారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ఆదాయాన్ని చూపించారని.. దాదాపు రూ. 23 కోట్ల ఆస్తులను ఇన్‌కం ట్యాక్స్ లెక్కల్లో చూపించలేదని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎ. మంజు జేడీఎస్ నుంచి అరకలగుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎ. మంజుపై 1,41,224 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ప్రజ్వల్ రేవణ్న. మంజుకు 5,35,382 ఓట్లు రాగా.. జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్నకు 6,76,606 ఓట్లు వచ్చాయి. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ప్రజ్వల్ రేవణ్న మాత్రమే. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ.. తన సిట్టింగ్ స్థానమైన హసన్‌ను మనవడు ప్రజ్వల్ రేవణ్నకు అప్పగించారు.
కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి.. రెబల్‌గా పోటీకి సై!.. కుమారస్వామి తగ్గేదేలే!