శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఓవైపు దూసుకెళుతుంటే.. మరోవైపు గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలోని ఓ గ్రామంలో వానలు పడాలని(rituals for rain) ఆరుగురు బాలికలను నగ్నంగా ఊరేగించారు. జబెరా పోలీస్ స్టేషన్ పరిధి, జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జిల్లా పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. త్వరలోనే తమ నివేదికను ఎన్సీపీసీఆర్కు సమర్పిస్తామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.
"స్థానిక సంప్రదాయం ప్రకారం వానలు కురవాలని కొంతమంది బాలికలను గ్రామంలో నగ్నంగా తిప్పినట్లు మాకు సమాచారం అందింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టాం. నగ్నంగా వెళ్లాలని బాలికలను ఒత్తిడి చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. అలా చేయటం ద్వారా వర్షాలు పడతాయని ఆ గ్రామస్థులు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే.. ఒక కర్రకు కప్పను కట్టి.. కర్రను నగ్నంగా ఉన్న బాలికలు మోస్తూ గ్రామంలో తిరుగుతారు. వారితో పాటు కొందరు మహిళలు తిరుగుతూ వాన దేవుడి కోసం భజనలు చేస్తారు."
- డీఆర్ తెనివార్, దమోహ్ జిల్లా ఎస్పీ.
ఈ సంఘటనలో బాలికల తల్లిదండ్రులు సైతం ఉన్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ చైతన్య. ఇలాంటి వాటిపై వారికి పూర్తి అవగాహన ఉన్నట్లు తెలిపారు. ఈ పూజలపై గ్రామం నుంచి ఎవరూ ఫిర్యాదు చేయాలేదని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో జిల్లా అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారని, అలాంటివి ఫలితాలు ఇవ్వవని చెబుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు.. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఓ వీడియో సుమారు 5 ఏళ్ల వయసు ఉన్న బాలికలు బట్టలు లేకుండా బుజాలపై కర్రను మోస్తూ కనిపించారు. వారితో పాటు కొంత మంది మహిళలు పాటలు పాడుతూ ఉన్నారు. మరో వీడియోలో.. వానలు లేక పంటపొలాలు ఎండిపోతున్నందున ఈ పూజలు చేసిట్లు కొంత మంది మహిళలు చెబుతున్నారు. ఇలా చేస్తే వర్షాలు వస్తాయని చెప్పారు.
ఇదీ చూడండి: lady harassed : మహిళను నడివీధుల్లో నగ్నంగా ఊరేగించారు..!