MP Kotha Prabhakar Reddy Knife Attack Case Updates : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న.. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజును పోలీసులు గజ్వేల్ జ్యుడీషియల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి కేసు వివరాలను.. సిద్దిపేట సీపీ శ్వేత వివరించారు. అక్టోబర్ 30న మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన రాజు.. ఎంపీని కలవడానికి వచ్చి చేతులు కలపబోయి కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో నిందితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రథమ చికిత్స అందించినట్లు తెలిపారు.
ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం విచారించగా.. ఏదైనా సంచలనమైన సంఘటన చేసి తాను అందరి దృష్టిలో పడాలని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. వారం రోజుల క్రితం బహిరంగ మార్కెట్లో కత్తి కొనుగోలు చేశాడని.. ఎంపీపై దాడి చేయడానికి ముందే ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడికి ఎవరి సహకారం లేదని స్పష్టం చేశారు. సదరు వ్యక్తి పలు యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లలో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడని.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని విచారణలో తేలిందన్నారు.
నిందితుడు రాజును అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఎంపీపై దాడి చేయడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమగ్ర దర్యాపు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గన్‌మెన్ ప్రభాకర్ నుంచి కత్తి, పాస్టర్ అంజయ్య వద్ద నుంచి నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో డిపాజిట్ చేశామన్నారు. కొందరు వ్యక్తులు ఈ ఘటనపై అవాస్తవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని.. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ శ్వేత హెచ్చరించారు.
"ఏదైనా సంచలన ఘటన చేసి అందరి దృష్టిలో పడాలని.. ఎంపీపై కత్తితో దాడికి పాల్పడినట్లు నిందితుడు రాజు ఒప్పుకున్నాడు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయడానికి ముందే ప్రణాళిక వేసుకున్నాడు. వారం క్రితం మార్కెట్లో కత్తి కొనుగోలు చేశాడు. అక్టోబర్ 30న సూరంపల్లిలో ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో వివిధ కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం". - శ్వేత, సీపీ సిద్దిపేట