Dalit Youth Thrashed: మధ్యప్రదేశ్ ఖర్గోన్లో దారుణ ఘటన జరిగింది. సోయా ఫుడ్ ప్యాకెట్లు దొంగిలించాడన్న అనుమానంతో.. దళిత యువకుడిపై మూక దాడి చేశారు. అతడి మతమేంటో తెలుసుకునేందుకు బట్టలు పూర్తిగా విప్పి చూశారు దుండగులు. స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఖర్గోన్ జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్రానీ పారిశ్రామిక ప్రాంతం వద్ద ఈ అమానవీయ ఘటన ఆగస్టు 2న జరిగింది.
బాధితుడిని 32 ఏళ్ల చీకూ రోకడేగా గుర్తించారు. విచిత్రమేంటంటే.. పోలీసులు నిందితులను పట్టుకోకుండా.. బాధితుడిని అరెస్టు చేశారు. తన కుమారుడు హిందువా, కాదా అని చూసేందుకు చిత్రహింసలు పెట్టారని బాధితుడి తల్లి ఆరోపించింది. దళితుడిని కొట్టిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయిన నేపథ్యంలో.. ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన పోలీసును సస్పెండ్ చేశారు. సోయాఫుడ్ కంపెనీకి చెందిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీస్ అవుట్‌పోస్ట్ ఇంఛార్జ్ రాజేంద్ర సింగ్ భగేల్.. బాధితుడిని అరెస్టు చేసి, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో విచారణకు ఆదేశించారు ఖర్గోన్ ఎస్పీ ధర్మవీర్ సింగ్.
ఇవీ చూడండి: కంప్యూటర్ సెంటర్లో మహిళపై గ్యాంగ్‌రేప్.. కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..
కరెంట్ స్తంభానికి కట్టి కర్రలతో దాడి.. గిలగిలా కొట్టుకుంటూ వృద్ధుడు మృతి