కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌కు ప్రముఖ ప్రచారకర్త హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రాథమికంగా పార్టీ నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఈసీకి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ ప్రచార నాయకుడు ఎవరో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని ఈసీని ప్రశ్నించింది ధర్మాసనం. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం.
మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ప్రచారం ముగిసిందని, మంగళవారం ఎన్నికలు జరగనున్నాయని కోర్టుకు తెలిపింది ఈసీ. ఇప్పటికే ప్రచారం ముగిసినందున కమల్‌నాథ్ పిటిషన్ చెల్లుబాటు కాదని వాదన వినిపించింది ఎన్నికల సంఘం.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణతో కమల్‌నాథ్ ప్రచార కర్త హోదాను ఈసీ తొలగించింది. దీని సవాలు చేస్తూ అక్టోబరు 30న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తీర్పుపై ఈసీ స్పందన
సుప్రీంకోర్టే సర్వోన్నతమైనదని వ్యాఖ్యానించింది ఎన్నికల సంఘం. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే పిటిషన్‌పై తమ అభిప్రాయం చెబుతామని తెలిపింది.
ఇదీ చూడండి: ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్