Motkupalli on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం రూ.7, 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు అని.. అలాంటి చంద్రబాబు.. రూ.300 కోట్లకు ఆశపడతారా అని ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేసినందుకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్ర 5 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. నేడు ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం.. ఆయన బాబు అరెస్టుపై మండిపడ్డారు.
Motkupalli Narasimhulu Fires on CM Jagan : ఎప్పుడూ ప్రజల బిడ్డనని చెప్పుకునే జగన్.. ఎవరి బిడ్డా కాదని, విచిత్రమైన బిడ్డ అని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే.. పూర్తి బాధ్యత జగన్‌దేనన్నారు. చంద్రబాబు అరెస్టుపై సీఎం కేసీఆర్ స్పందించాలని మోత్కుపల్లి కోరారు. రాజకీయాలు పక్కన పెట్టి కేసీఆర్ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిదని తెలిపారు. ఈ క్రమంలోనే రాజమండ్రికి వెళ్లి భువనేశ్వరిని పరామర్శిస్తానని.. అవకాశం ఉంటే బాబును ములాఖత్‌లో కలుస్తానని వివరించారు.
"ప్రజల కోసం 7, 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి చంద్రబాబు.. ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా? చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. జగన్.. ఎవరి బిడ్డా కాదు.. విచిత్రమైన బిడ్డ. జైలులో చంద్రబాబుకు ఏదైనా అయితే జగన్‌దే బాధ్యత. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు. జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. చంద్రబాబు లాంటి నేతను తీసుకెళ్లి జైలులో పెట్టి.. రాక్షసానందం పొందుతున్నారు". - మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత
CID on CBN Skill Development Case: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..! అంతా సీఐడీ మార్కు కనికట్టు
చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారని విమర్శించారు. ఏపీలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. చంద్రబాబు లాంటి నేతను తీసుకెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని నిలదీశారు. ఈ క్రమంలోనే కిరాతకుడిగా కాదు.. మనిషిగా మారాలని జగన్‌కు సలహా ఇస్తున్నానని మోత్కుపల్లి పేర్కొన్నారు. దళితులు, పేదలు తిరుగుబాటు చేయక ముందే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో దళితులపై అనేక ఘోరాలు జరుగుతున్నాయన్న ఆయన.. దళిత ద్రోహి.. ఏపీ సీఎం జగన్ అని దుయ్యబట్టారు.
"కిరాతకుడిగా కాదు.. మనిషిగా మారాలని జగన్‌కు సలహా ఇస్తున్నా. దళితులు, పేదలు తిరుగుబాటు చేయకముందే జగన్ క్షమాపణ చెప్పాలి. ఏపీలో దళితులపై అనేక ఘోరాలు జరుగుతున్నాయి. దళిత ద్రోహి.. ఏపీ సీఎం జగన్. చంద్రబాబు అరెస్టు అనేది రాజ్యాంగ విరుద్ధం." - మోత్కుపల్లి
ఇదిలా ఉండగా.. చంద్రబాబు నాయుడు అరెస్టును రాష్ట్ర టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బాబు అరెస్టును నిరసిస్తూ ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించిన మహా నాయకుడిని అరెస్టు చేయడం అక్రమం, అన్యాయమని నినదించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు అరెస్టుతో ప్రతి ఇంట్లో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఆయనను విడుదల చేసేంత వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.