Mothers Donate Milk in Vijayawada : రక్తదాతలు, అవయవదాతలు.. ఇలాంటి వారిని చూస్తుంటాం.. మీరెప్పుడైనా పాల దాతల గురించి విన్నారా... అవునండీ ఇప్పుడిదే నూతన ఒరవడి. ఎన్ని రకాల ప్రాసెసింగ్ మిల్క్ వచ్చినా.. తల్లి చనుబాలకు ప్రత్యామ్నాయం లేదు. వివిధ కారణాల ద్వారా తల్లిపాలు అందక ఎంతో మంది నవజాత శిశువులు అల్లాడుతుంటారు. పుట్టే బిడ్డలకు అమృతం లాంటి తల్లిపాలను ఉచితంగా పంచుతున్నారు విజయవాడ వనితలు. ఎందరో పిల్లల ఆకలి తీరుస్తున్న విజయవాడ మాతృమూర్తుల స్ఫూర్తిగాథను మీరూ చూడండి.
Mothers Donate Milk in Vijayawada : ఏపీలోని విజయవాడ విద్యాధరపురానికి చెందిన రచన.. సాధారణ గృహిణి. అయితేనేం ఎవరూ చేయలేని పనికి శ్రీకారం చుట్టారు. రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాలపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన ఏర్పడుతున్న తరుణంలో తల్లి పాలను దానం చేయడానికి ముందుకు వచ్చారామె. మొదట సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న రచన.. తర్వాత అవగాహన ఏర్పరుచుకుని తనే తల్లి పాలను దానం చేయడం ప్రారంభించారు.
తల్లి పాలు దానం చేస్తే ఎంతో మేలు
Mothers Donate Milk in Vijayawada : తమిళనాడులో ఓ మహిళా కానిస్టేబుల్ ఒకరు ఈ విధంగానే తల్లి పాలను దానం చేశారని తెలిసి స్పూర్తి పొందారు రచన. విజయవాడలో తల్లి పాలను నిల్వచేసే బ్యాంకులు లేవని తెలిసీ గూగుల్ ద్వారా సెర్చ్ చేయగా హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో ఈ బ్యాంకు ఉందని తెలిసింది. వారిని సంప్రదించగా విజయవాడలోని తమ బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించారు. తన కుమారుడు ఎంత పాలు తాగుతారో అంచనా వేసుకుని, మిగతా పాలను విజయవాడలోని ఆస్పత్రి సిబ్బందికి ఇస్తున్నారు. పంపింగ్ మిషన్ ద్వారా పాలను పంప్ చేసి స్టెరిలైజ్డ్ ప్యాకెట్లలో తల్లి పాలను నింపుతున్నారు.
వీటిని జాగ్రత్తగా డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసి వారికి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది పిల్లలకు 27 లీటర్ల పాలను సరఫరా చేశారు. తల్లి పాలను అందించడానికి పెద్దలు ఎక్కువ తినాలని చెబుతారు. కానీ పోషకాహారం ముఖ్యమని, ఇందుకు హైప్రొటీన్లను అందించే రాజ్మా, శనగలు, వేడినీరు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు రచన. మాతృత్వం అనేది గొప్పవరమని.. ఇలాంటి సమయంలో తల్లి పాలను అమృతంగా భావించి వృధా కాకుండా పది మందికి ఇచ్చి సాయం చేయాలన్నదే తన అభిమతమని చెబుతున్నారు ఈ మాతృమూర్తి.
అమృతం తల్లి పాల కేంద్రం ఉండగా.. తల్లి పాలకు చింత ఏలా..
70 లీటర్ల తల్లి పాలు దానం : బ్లడ్ బ్యాంకులు మాదిరిగా తల్లి పాల బ్యాంకుల ప్రభుత్వం విరివిగా ఏర్పాటు చేయాలంటున్నారు విజయవాడ శ్రీరామచంద్ర నగర్‌కు చెందిన హరిత. ఈమె తల్లిపాల గురించి చెప్పడమే కాదు.. రోజుకు 8 సార్లు పాలివ్వడం ద్వారా ఇప్పటి వరకు 70 లీటర్ల తల్లి పాలను రెయిన్ బో ఆస్పత్రికి అందించారు. తల్లి పాల గురించి ప్రభుత్వం చెబుతున్నా ప్రజల్లో ఇంకా చైతన్యం పూర్తిగా రావడం లేదని హరిత చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా 5 మిలియన్ల మంది పిల్లలకు తల్లిపాలు అవసరమని, ఇవి సకాలంలో అందక ఎంతో మంది చనిపోతున్నారని హరిత ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం, ఇతర దానాల గురించి అందరూ చెబుతున్నారని, తల్లి పాలపై ఇంకా ప్రచారం పెరగాలని హరిత కోరుతున్నారు. కొత్తగా పుట్టిన పిల్లలకు 5 మిల్లీ లీటర్లు చాలని, ఇలా ఎంతో మందికి తల్లి పాలను సాయం చేయవచ్చంటున్నారు హరిత. కుటుంబ సభ్యులు సైతం తనను ప్రోత్సహిస్తున్నారని హరిత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రికి అవయవదానం చేసేందుకు కోర్టుకెళ్లిన మైనర్.. తొలి మైనర్ దాతగా ఘనత