అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని (Supreme Court News) సుప్రీంకోర్టు తెలిపింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం (Supreme Court News) ఈ విషయమై తీర్పు ఇస్తూ "అల్లుడు-కుమార్తెల వద్ద అత్త నివసించడం భారత సమాజంలో అసాధారణమేమీ కాదు. వృద్ధాప్యంలో పోషణ నిమిత్తం అల్లుడి పైనా ఆధారపడుతుంటారు. అల్లునికి అత్త చట్టబద్ధమైన వారసురాలేమీ కాదు. కానీ ఆయన మరణించినప్పుడు తప్పుకుండా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల పరిహారం పొందడానికి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం ఆమె చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుంది" అని పేర్కొంది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సందర్భంగా పైవిధంగా స్పష్టత ఇచ్చింది.
పూర్వపరాల్లోకి వెళ్తే... కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల ఆయన కుటుంబానికి రూ.74,50,971 పరిహారం చెల్లించాలని (Supreme Court News) మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా పరిహారాన్ని రూ. 48,39,728కు తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని. తెలిపింది. దీనిపై మృతుని భార్య సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. మృతుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ.83,831 జీతం పొందిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. 52 ఏళ్ల వయసులో మరణించినందున ఆ కుటుంబం నష్టపోయిందని అభిప్రాయపడింది. అందువల్ల రూ.85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది. అల్లునిపై ఆధారపడ్డ అత్త కూడా పరిహారానికి అర్హురాలేనని తెలిపింది.
సెంట్రల్ విస్టా పనులపై కేంద్రానికి 'సుప్రీం' నోటీను
సెంట్రల్ విస్టా పనుల్లో జరిగిన భూ వినియోగ మార్పిడిపై (Central Vista Project Supreme Court) సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్టర్‌ష్లాన్ ప్రకారం ప్రజల మానసిక ఉల్లాసం కోసం ఉద్దేశించిన స్థలంలో నివాస గృహాలు నిర్మిస్తుండడంపై అభ్యంతరం తెలుపుతూ వ్యాజ్యం దాఖలైంది. దీనిని జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం (Central Vista Project Supreme Court) విచారణకు చేపట్టింది. ఆ స్థలంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాస గృహాలను నిర్మించనున్నట్టు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ "అంటే... ఇక్కడ ఇకపై ప్రజల మానసికోల్లాసానికి స్థలం ఉండదా? వేరే చోట ఆ సౌకర్యాలు కల్పిస్తారా" అని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకొని సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. దాంతో ఆ ఒక్క విషయంపైనే మూడు రోజుల్లో సంక్షిప్తంగా ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
టీకాలపై అనుమానాలు వద్దు
కరోనా టీకా పంపిణీ కార్యక్రమంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజలందరికీ ఇవ్వడాన్ని నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన అప్పీలును కొట్టివేసిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. అన్ని దశల క్లినికల్ పరీక్షలు ఇంకా పూర్తికానందున వీటిని ప్రజలందరికీ ఇవ్వకూడదంటూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తొలుత కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. వారికి రూ.50 వేల జరిమానా కూడా విధించింది. దీనిపై వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ బి. వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. "పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు సరైన నిర్ణయమే తీసుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై అనుమానాలు వద్దు. ప్రజలను రక్షించడానికి ఇవే కీలకమైనవి" అని పేర్కొంది.
ఇదీ చూడండి : 'భారత ఎన్నికల్లో ఫేస్బుక్ జోక్యం'- జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్