Mother In Law Daughter In Law Fight : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ.. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది. రోజూ జీన్స్ ధరించే అత్త.. కోడలు కూడా జీన్సే వేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. తనకు చీర కట్టుకోవడమే ఇష్టమని చెబుతున్నా.. తన అత్త వినట్లేదని కోడలు వాపోతోంది. చేసేదేం లేక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను కోడలు ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే..
హరిపర్వత్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ యువకుడికి.. ఎత్మాద్పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న యువతితో ఏడాది క్రితం వివాహమైంది. యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా.. యువతి హౌస్‌వైఫ్. జీన్స్ అలవాటు లేని ఆ యువతి.. రోజూ చీరలే కట్టుకుంటోంది. అది నచ్చని ఆమె అత్త.. కోడలిని ఎగతాళి చేస్తోంది. తనలాగా జీన్స్ మాత్రమే వేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. రోజూ ఇంట్లో ఇదే తంతు జరుగుతుండడం వల్ల.. కోడలు తాజాగా ఆగ్రా పోలీస్‌స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. జరిగినదంతా వివరించింది. ఫిర్యాదు అందుకున్న కౌన్సిలింగ్ సెంటర్ ఆమెతో పాటు అత్త, భర్తను పిలిపించారు.
తాను గ్రామీణ వాతావరణం నుంచి వచ్చానని.. పెళ్లి తర్వాత చీరలు కట్టుకోవడమే తనకు తెలుసని కోడలు.. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో చెప్పింది. "నాకు చీర కట్టుకోవడమే ఇష్టం. కానీ అది మా అత్తకు ఇష్టంలేదు. చీర కట్టుకుంటే ఎగతాళి చేస్తోంది. జీన్స్ వేసుకోమని చెబుతోంది. ఆ నెపంతో గొడవ పడుతోంది. నాకు జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదు. మా అత్త జీన్స్ ధరించడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే తిడుతున్నారు. జీన్స్ వేసుకోమంటున్నారు. వేసుకోనంటే కొడుతున్నారు" అని కోడలు ఆరోపించింది. అయితే రోజూ ఇంట్లో తన తల్లి, భార్య మధ్య గొడవలతో తాను విసిగిపోయానని యువకుడు తెలిపాడు. తన తల్లి మాటను భార్య వినడం లేదని చెప్పాడు.
తమ సెంటర్‌కు గొడవల కారణంగా విచ్చేసిన భార్యాభర్తలు, అత్తాకోడళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తామని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నోడల్ ఏసీపీ సుకన్య శర్మ తెలిపారు. అయితే వీరి విషయంలో మాత్రం ఇంకా సయోధ్య కుదరలేదని చెప్పారు. మరోసారి కౌన్సిలింగ్‌కు పిలిపించినట్లు వెల్లడించారు.