పుట్టి నెలరోజులు కూడా గడవకముందే బిడ్డ మరణించడం వల్ల మనస్తాపానికి గురైన తల్లి, చిన్నారి అన్యయ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో వెలుగు చూసింది.
నెలరోజులు గడవకముందే..
ఇడుక్కిలోని ఉప్పుతర ప్రాంతంలో నివాసముండే లిజా టామ్(38) కొద్దిరోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు వయసు కేవలం 29 రోజులే. ఈ క్రమంలో తాజాగా ఆ చిన్నారికి పాలు పట్టించింది తల్లి లిజా. ప్రమాదవశాత్తు తల్లి పాలు గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది చిన్నారి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లిజా ఆమె పెద్ద కుమారుడు బెన్ టామ్(7) ఇంటి ఆవరణలో ఉన్న 40 అడుగుల లోతైన బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా చనిపోయిన చిన్నారి అంత్యక్రియలు బుధవారమే పూర్తి చేశారు కుటుంబ సభ్యులు.
అయితే మరుసటి రోజు నిర్వహించే మరణానంతర కార్యక్రమాల కోసం బంధువులంతా ప్రార్థనల కోసం స్థానికంగా ఉండే చర్చికి వెళ్లారు. కానీ లిజా, బెన్ టామ్ మాత్రం మందిరానికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే తల్లి, ఆమె పెద్ద కుమారుడు బెన్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బంధవులు ఇద్దరు ఇంట్లో కనిపించకపోడం వల్ల ఇంటి పరిసరాలన్నీ వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతున్న సమయంలో దగ్గర్లోని బావిలోకి వెళ్లి చూడగా ఇద్దరు అందులో విగతజీవులుగా కనిపించారు. ఇది గమనించిన కుటుంబీకులు బోరున విలపించారు. చిన్నారి మృతి చెందిందన్న కారణంతోనే లిజా ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని బంధువులు చెబుతున్నారు.
కాగా, లిజా కుటుంబం గత కొన్నేళ్లుగా అదే ఇంట్లో ఉంటోంది. ఈ సమాచారాన్ని పోలీసులుకు అందించారు కుటుంబ సభ్యులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్వ్యూకు కోడలు.. ఇటుకతో కొట్టిన మామ!
దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగంది. ఓ వ్యక్తి.. తన కోడలిపై దాడికి పాల్పడ్డాడు. ఇటుకతో దాడి చేస్తున్న దృశ్యాలు.. సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌కు బాధితురాలికి వివాహం జరిగింది. అయితే ఆమె ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తానని చెప్పింది. అందుకు నిరాకరించిన ప్రవీణ్ మామ.. ఆమెపై ఇటుకతో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త.. స్థానిక ఆస్పత్రికి తరలించాడు. మహిళ తలకు 17 కుట్లు పడ్డాయి. ఆమె చేతులకు కూడా గాయాలయ్యాయి. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడిపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
బిడ్డకు జన్మనిచ్చిన మైనర్..
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఓ 16 ఏళ్ల విద్యార్థిని ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు తల్లీబిడ్డలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 16 ఏళ్ల పాఠశాల విద్యార్థిని గురువారం ఉదయం తన ఇంట్లోనే ప్రసవించింది. అయితే బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి తమకేమీ తెలియదని కుటుంబీకులు చెబుతున్నారు. గతేడాది తనతో పాటు పాఠశాలలో చదువుకున్న కుమలి ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ను ప్రేమిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.