Karnataka Elections Shivashankarappa : కర్ణాటక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అత్యంత వయోవృద్ధుడైన అభ్యర్థిగా నిలిచిన శామనూరు శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
శామనూరు శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడు. ఇప్పుడు ఆయన వయసు 92 ఏళ్లు. ఈ వయసులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి గెలుపొందారు.
శామనూరు శివశంకరప్ప రాజకీయ ప్రస్థానం ఇలా..
- 1994- రాజకీయాల్లోకి అరంగేట్రం
- 1994- దావణగెరె మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నిక
- 1994- దావణగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1997- లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు
- 1999- లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి ఓటమి
- 2004- దావణగెరె ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు
- 2008, 2013, 2018 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు దావణగెరె దక్షిణ ఎమ్మెల్యేగా విజయం
- 2023- అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయంశివశంకరప్ప
దావణగెరె దక్షిణ నియోజకవర్గం శామనూరు శివశంకరప్ప వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008లో దావణగెరె నియోజకవర్గాన్ని దావణగెరె దక్షిణగా విడదీశారు. మొత్తంగా దావణగెరె నగరం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం. ఇలా వరుస విజయాలతో దావణగెరె దక్షిణ ప్రజలపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేసిన శివశంకరప్ప 'నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయి. నా వయసు 90 ఏళ్లు దాటినప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈసారి కూడా మళ్లీ నేనే గెలిచి చరిత్ర సృష్టిస్తా' అని ఇటీవలే తెలిపారు. చెప్పినట్లుగానే విజయం సాధించారు.
మరోవైపు శంకరప్పకు పోటీగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి బీజీ అజయ్‌కుమార్‌కు ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లతో మంచి అనుబంధమే ఉంది. కానీ శివశంకరప్పకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో విజయకుమార్‌ను బరిలోకి దింపిన కమలం పార్టీ వ్యూహం బెడిసికొట్టింది.
![Most Senior Candidate shivshankarappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18284153_shankar-4.jpg)
లక్ష ఓట్ల తేడాతో డీకే శివకుమార్ విజయం
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. కనకపురా నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి బి.నాగరాజుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు.
కనకపురాలో శివకుమార్‌కు పోటీగా నామినేషన్ వేయాలన్నా ప్రత్యర్థులు రెండు మూడు సార్లు ఆలోచించాల్సిందే. 2008 వరకు కనకపురా అంటే జేడీఎస్‌కు కంచుకోట. ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ బలపడిందంటే అందుకు ప్రధాన కారణం డీకే కుటుంబమే. పంచాయతీ భవనాలు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ల వసతులతో ఈ ప్రాంతాన్ని డీకే సోదరులు అభివృద్ధి చేశారు. శివకుమార్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన బీజేపీ.. అశోక్‌ను బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు.
![Most Senior Candidate shivshankarappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18493334_thiuee.jpg)
మాజీ సీఎంకు షాక్.. నాలుగోసారి కృష్ణప్ప విజయం..
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ షెట్టర్‌కు గట్టి షాక్ తగిలింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి మహేశ్ చేతిలో 35 వేల ఓట్ల తేడాతో పరాజయం చెందారు. మరోవైపు, బీజేపీ సీనియర నేత ఎం.కృష్ణప్ప.. బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్కే రమేశ్‌పై 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.