దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా యాక్టివ్ కేసులు 2 శాతమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరణాల రేటు కూడా 2 శాతం కంటే తక్కువే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దేశంలోని తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రలోనే 60శాతం ఉన్నాయని తెలిపారు.
"దేశంలో కరోనా కేసులు 2020 మార్చి నుంచి నమోదవుతున్నాయి. సెప్టెంబర్ మధ్యలో ప్రతి రోజూ 97వేల కేసులు వస్తూ ఉండేవి. అతి తక్కువ కేసులు నవంబర్ 9న వచ్చాయి. నవంబర్ 9న ఒక్క రోజు 9వేల 110 కొత్త కేసులు వచ్చాయి. నవంబర్ 9 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడం వల్ల మొత్తం కేసుల్లో పెరుగుదల నమోదు ప్రారంభమైంది."
- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
ఆరోగ్య శాఖ వెల్లడించిన పలు కీలక అంశాలు..
- కొత్త కేసుల్లో కనిష్ఠ స్థాయి ఫిబ్రవరి 9న నమోదైంది. ఆ తర్వాత వారం వారం 43 శాతం మేర కొత్త కేసులు పెరిగాయి. మరణాల్లో 37 శాతం పెరుగుదల నమోదైంది.
- పంజాబ్లో పాజిటివిటీ రేటు 6.8 శాతంగా ఉంది. అది ఆందోళన కలిగించే విషయం. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించటం లేదని సూచిస్తోంది.
- యాక్టివ్ కేసుల్లో 60 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి.
- పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య 2 శాతం లోపే ఉంది.
- కర్ణాటకలో కేసుల పాజిటివిటీ రేటు 1.3 శాతం. పరీక్షల సంఖ్యను పెంచాలని ఆ రాష్ట్రానికి సూచించాం.
- ఇప్పటి వరకు 3.51 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశాం.
- దిల్లీలో బుధవారం 400కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే.. పాజిటివిటీ రేటు ఒక శాతంలోపే ఉంది.
- గత 15 రోజుల్లో 16 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో కొవిడ్ కేసుల్లో 150 శాతం పెరుగుదల నమోదైంది.
- భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ వృథా 6.5 శాతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 17.6, 11.6 శాతంగా ఉంది. టీకా వృథాను తగ్గించాలని ఆయా రాష్ట్రాలకు సూచించాం.
- మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా 8.34 మిలియన్ల టీకా డోసులు పంపిణీ చేయగా అందులో భారత్లోనే 36 శాతం పంపిణీ జరిగింది.
ఇదీ చూడండి: కేసుల్లో పెరుగుదల.. ఒక్కరోజే 29వేల మందికి కరోనా