500 snake bites to a person: మహారాష్ట్రలో లాతూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పాములు పగబట్టినట్లు తెలుస్తోంది! జిల్లాలోని అవుసా పట్టణంలో ఉండే అనిల్ తుకారాం గైక్వాడ్ అనే వ్యక్తి గత 10-15 ఏళ్లలో దాదాపు 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు.
గైక్వాడ్ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలోనే గాక జనసముహంలోనూ పాముకాటుకు గురయ్యాడు. ఇన్ని సార్లు ఇతడొక్కడినే పాములు కాటేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిత్యం పాము కాటులకు గురవుతుండడం వల్ల గైక్వాడ్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి కొన్ని సార్లు చికిత్స చేయాల్సి వస్తోంది. దీంతో గైక్వాడ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
పాములు ఒకే వ్యక్తిని కాటేయడానికి కారణాలేంటనే విషయాన్ని వైద్యులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
"ఐదేళ్లలో కనీసం 150 సార్లు అనిల్ గైక్వాడ్‌కు వైద్యం చేశా. జనసమూహంలో ఉన్నప్పటికీ.. ఈయనే ఎందుకు పాము కాటులకు గురవుతున్నాడో అర్థం కావట్లేదు. అంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది."
-సచ్చిదానంద్ రణదివే, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు
ఇదీ చదవండి: దొంగ పేరుతో వాట్సాప్ గ్రూప్.. ఆ పోలీసుల నయా ట్రెండ్!