ఉత్తర్ప్రదేశ్ మథురాలో యుమునా ఎక్స్ప్రేస్ వేపై వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవాళ్లలో ఒకరు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
చెట్టును ఢీకొని ఐదుగురు యువకులు మృతి
హరియాణా కురుక్షేత్రలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా సమీప ప్రాంతాలకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.
మినీబస్సులో మంటలు..
మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని బారాఖేడ్లో శుక్రవారం తెల్లవారుజామున మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు ట్రక్కును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టగానే మంటలు చెలరేగాయని, అందులో 28మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు మంటల్లోనే చిక్కుకుని సజీవదహనమైట్లు వివరించారు. మిగతావారు తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యూపీలో 'జికా' పంజా- కొత్తగా 30 మందికి వైరస్