No Confidence Motion In Parliament : విపక్షాల కూటమి 'ఇండియా'లో కొన్ని పార్టీలు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మణిపుర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలి అవి డిమాండ్ చేస్తున్నాయి. అధికార బీజేపీ మాత్రం అందుకు విముఖత చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో పలు పార్టీలు సమావేశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. రాజ్యసభలో కూడా మణిపుర్ అంశంపై చర్చ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించాయి.
మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ నిబంధనలకు విరుద్దంగా వ్యహవరించినందుకు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సంజయ్‌సింగ్‌ను ఛైర్మన్ సస్పెండ్ చేశారు. మణిపుర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకే తనను సస్పెండ్ చేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు.
వ్యూహాలకు పదును పెట్టిన బీజేపీ..
BJP Parliamentary Party Meeting : సభా ప్రారంభానికి ముందు బీజేపీ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తుల పేరులో కూడా ఇండియా ఉందంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు ఇలాంటి దశాదిశా లేని ప్రతిపక్షాన్ని చూడలేదని ఘాటుగా విమర్శించారు. విపక్షాల ఆందోళనల వేళ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంటరీ భేటీలో బీజేపీ నేతలు చర్చించారు.
గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష
మరోవైపు సోమవారం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడం మరింత దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ కొందరు విపక్ష ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఆప్, కాంగ్రెస్‌తో సహా 'ఇండియా (విపక్ష కూటమి)' సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. సస్పెన్షన్ వేటు పడిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాత్రంతా వీరు నిరసన కొనసాగించారు. అంతకుముందు సోమవారం కూడా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. కాగా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించారంటూ.. వర్షాకాల సమావేశాలకు హాజరుకాకుండా రాజ్యసభలో ప్రత్యేక తీర్మానం ద్వారా సభ నుంచి సస్పెండ్ చేశారు.