నైరుతి రుతుపవనాలు జూన్ 15 నాటికి ఒడిశా, ఝార్ఖండ్, బంగాల్, బీహార్ రాష్ట్రాలను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రాబోయే 10 రోజుల్లో మరింత చురుగ్గా కదులుతాయని వెల్లడించింది.
ప్రస్తుతం మధ్య అరేబియా సముద్రంతో పాటు.. కర్ణాటక తీరప్రాంతం, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. జూన్ 11 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఇది రుతుపవనాల పురోగతికి తోడ్పడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఇక రాబోయే ఐదు రోజుల్లో దేశంలో వేడి తీవ్రత తగ్గుతుందని ఐఎండీ అధికారి రాజేంద్ర జెనమణి తెలిపారు. జూన్ 7-8 తేదీల్లో వర్షపాతం కాస్త తగ్గుతుందన్నారు.
ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ తేదీ కన్నా రెండు రోజులు ఆలస్యంగా జూన్ 3న కేరళను తాకాయి. జూన్లో సాధారణ వర్షపాతం ఉంటుందని గతంలో ఐఎండీ అంచనా వేసింది.
ఇవీ చదవండి: 'ఈ ఏడాది సాధారణ వర్షపాతమే'