'జంగిల్ బుక్' సినిమాల్లో మోగ్లీ అనే బాలుడు గుర్తున్నాడా? అడవిలో పెరిగిన అతడు.. జంతువుల్లో ఒకడిగా జీవిస్తాడు. నడుముకు ఓ చిన్నపాటి వస్త్రం తప్ప శరీరంపై దుస్తులేవీ ధరించడు. మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ కథ సాగుతుంటుంది. అయితే, ఇదే రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు.. అచ్చం మోగ్లీలాగే ప్రవర్తిస్తున్నాడు. అడవిలో పెరగనప్పటికీ.. ఒంటిపై వస్త్రాలు ధరించకుండానే తిరుగుతున్నాడు. కాలేజీకి సైతం అలాగే వెళ్తున్నాడు. ఒక్క అండర్వేర్ తప్ప.. షర్టు, ప్యాంటు వంటివేవీ లేకుండానే తరగతులకు హాజరవుతున్నారు.
బడ్వానీకి చెందిన కన్నయ్యకు చిన్నప్పటి నుంచి బట్టలు వేసుకోవడం అంటే చిరాకు. దుస్తులు అంటేనే మండిపడేవాడు. ఎవరైనా బట్టలు వేసుకోమ్మని చెబితే.. వారితో మాట్లాడటం మానేసేవాడు. స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించినప్పుడు.. కన్నయ్య తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా, కన్నయ్య పట్టించుకోలేదు. 'స్కూల్‌కు వెళ్లే ముందు బట్టలు వేసేందుకు ప్రయత్నించా. కానీ వాటిని తీసి పక్కన పడేసేవాడు. కాస్త గట్టిగా చెబుదామని ప్రయత్నిస్తే.. బట్టల్ని చించేసేవాడు' అని కన్నయ్య తల్లి చెబుతున్నారు.
ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత మాధ్యమిక పాఠశాలలో చేరాడు కన్నయ్య. అప్పుడైనా వస్త్రాలు ధరిస్తాడని కుటుంబ సభ్యులు భావించినా.. అది జరగలేదు. స్కూల్ టీచర్లే ఓసారి బట్టలు కొని తెచ్చి ఇచ్చారు. కానీ వాటిని బాలుడు ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. మాధ్యమిక విద్య అయిపోయిన తర్వాత కన్నయ్య కుటుంబానికి ఓ చిక్కొచ్చి పడింది. బిడ్వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కన్నయ్యను చేర్పించేందుకు వెళ్తే.. అక్కడి యాజమాన్యం చేర్చుకోలేదు. దీంతో ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతే.. పాఠశాలలో చేర్చుకున్నారు.
టీచర్లు సపోర్టే!
అయితే, కన్నయ్య చదువులో ముందుండేవాడు. క్లాస్‌లో క్రమశిక్షణతో ఉండేవాడు. టీచర్లతో చక్కగా మెలిగేవాడు. పలు క్రీడల్లోనూ నైపుణ్యం ప్రదర్శించేవాడు. ఓ మంచి స్టూడెంట్‌కు ఉండే లక్షణాలన్నీ అతడికి ఉన్నాయి కాబట్టి.. స్కూల్లో టీచర్లు అతడి వస్త్రధారణపై అభ్యంతరం చెప్పేవారు కాదు. థామస్, రమేశ్ చంద్ సరఫ్ అనే ఉపాధ్యాయులు అతడిని బాగా ప్రోత్సహించారు.
ఇక కాలేజీలో కచ్చితంగా వస్త్రాలు ధరించాల్సి వస్తుందేమోనని కన్నయ్య.. పదో తరగతి తర్వాత చదవడం ఆపేస్తానని చెప్పాడు. అయితే, అతడిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు అందుకు ఒప్పుకోలేదు. చాలా శ్రమపడి కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కన్నయ్య. ఇప్పటికీ వస్త్రాలు లేకుండానే క్లాసెస్‌కు వెళ్తున్నాడు. ఓ అండర్వేర్, పైనుంచి టవల్ తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించడు. వినయంగా ఉండే కన్నయ్య చూసిన విద్యార్థులు.. అతడిని అర్థం చేసుకుంటున్నారు. అతడితో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. చదువు పూర్తైన తర్వాతైనా బట్టలు వేసుకుంటాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు కన్నయ్య కుటుంబ సభ్యులు.