'జల్ శక్తి అభియాన్- వర్షపు నీటిని ఒడిసిపట్టు(క్యాచ్ ద రైన్)' ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(సోమవారం) ప్రారంభించనున్నారు. ప్రపంచ జల దినం సందర్భంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా మార్చి 22 నుంచి నవంబర్ 30 వరకు ప్రజలందరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు.
ఇదే రోజున దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర నదీ జలాల అనుసంధానం ప్రణాళికకు అడుగులు పడనున్నాయి. కేన్, బేట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు.
పడ్డచోటే ఒడిసిపట్టు..
'వర్షపు నీటిని ఒడిసిపట్టు' కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 'ఎప్పుడు పడ్డా.. పడ్డచోటే వర్షపు నీటిని ఒడిసిపట్టు' అనే నినాదంతో ప్రచారాన్ని సాగించనున్నట్లు పేర్కొంది. మార్చి 22 నుంచి నవంబర్ 30 మధ్య ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలందరూ పాలుపంచుకునేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. దేశమంతటా గ్రామసభలలో నీటి పరిరక్షణ అవగాహన సమావేశాలు జరపనున్నట్లు వెల్లడించింది.
వాజ్పేయీ సంకల్పానికి ఆరంభం..
దౌదన్ ప్రాజెక్టు నిర్మించి కేన్, బేట్వా నదులను అనుసంధానించనున్నారు. 10.62 లక్షల హెక్టార్ల భూమి దీనివల్ల సాగులోకి రానుంది. 62 లక్షల మందికి తాగు నీరు అందనుంది. 103 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో నీటి ఎద్దడి ఎదుర్కొనే జిల్లాలకు నీరు అందనుంది.
కేన్, బేట్వా నదుల అనుసంధానం దేశంలో నదుల అనుసంధానానికి తొలిమెట్టుగా ప్రధాని కార్యాలయం అభివర్ణించింది. జల వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల నుంచి కరవు ఎదుర్కొనే ప్రాంతాలకు నీరందించాలనే మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇది ఆరంభం అని పేర్కొంది.
ఇదీ చూడండి: 'హిరేన్ మృతి కేసు కథ ముగిసింది!'