కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటన చేపట్టారు. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్న మోదీ.. అక్కడి జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'జైకోవ్-డి' టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధరించి వ్యాక్సిన్ ప్రయోగశాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల్లో ఉంది.
జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించిన అనంతరం ట్వీట్ చేశారు మోదీ. టీకా అభివృద్ధిలో ఆ సంస్థ శాస్త్రవేత్తల బృందం సాధించిన పురోగతిని కొనియాడారు. వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.






అంతకుముందు సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ చర్చించారు. దాదాపు గంటపాటు ప్లాంట్‌లో గడిపారు. ప్రధానిని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్క్ వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. వారికి మోదీ అభివాదం చేశారు.


జైడస్ హర్షం..
ప్రధాని మోదీ తమ ప్లాంట్‌ను సందర్శించడం పట్ల జైడస్ క్యాడిలా సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని పర్యటన స్ఫూర్తి దాయకమని ప్రశంసించింది. ఇది తమ ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపుతుందని, దేశ ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు శాయశక్తులా కృషి చేసేందుకు దోహదపడుతుందని జైడస్ సంస్థ పేర్కోంది.
అహ్మదాబాద్ తర్వాత ప్రధాని మోదీ.. హైదరాబాద్, పుణెల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’, పుణెలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ ప్రయోగాలను మోదీ పరిశీలించనున్నారు.