Modi Punjab security breach: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను మంత్రులంతా తీవ్రంగా ఖండించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణాలు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిపాయి.
Cabinet meeting today news:
ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్లో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రులు మాట్లాడారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారని తెలిపాయి. 'ప్రధాని భద్రత ఇలా ఉల్లంఘనకు గురికావడం గతంలో ఎప్పుడూ చూడలేదని మంత్రులు అన్నారు. సరైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి మరోసారి జరగవని అభిప్రాయపడ్డారు' అని ఓ మంత్రి పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి చర్చ జరిగిందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. హోంశాఖ పెద్ద, కఠినమైన నిర్ణయాలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. దేశ న్యాయవ్యవస్థ అందరికీ న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సెక్రెటేరియట్ కార్యదర్శి సుధీర్ కుమార్ సక్సేనా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఐజీ ఎస్ సురేశ్‌లు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. వీలైనంత త్వరగా నివేదిక అందించాలని హోంశాఖ ఈ కమిటీని ఆదేశించింది.
Union Cabinet decisions today
ఇదిలా ఉండగా.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడు రాష్ట్రాల్లోని పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ.12,031 కోట్లతో ట్రాన్స్మిషన్ లైన్లను నిర్మించాలని నిర్ణయించింది. రెండో విడత 'గ్రీన్ ఎనర్జీ కారిడార్'గా పిలిచే ఈ ప్రాజెక్టులో భాగంగా.. 2026 నాటికి 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లను నిర్మించనున్నారు.
Green Energy Corridor project
- ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,031.33 కోట్లు.
- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ రవాణా కోసం ఈ లైన్లు వేయనున్నారు.
- రూ.10,142 వేల కోట్లతో చేపట్టిన గ్రీన్ కారిడార్ తొలి విడత పనులు 80 శాతం పూర్తి.
- ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో తొలి విడతలో లైన్లు వేయడం ప్రారంభించారు.
- ఈ ప్రాజెక్టు 2022లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: