అసోంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో ఆయనకు ఆరు ప్రశ్నలు సంధించింది.. కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి.
పౌరసత్వ సవరణ చట్టం, ఉపాధి కల్పన, ఎస్టీ హోదా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, టీ తోటల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం, విపరీతమైన ఇంధన ధరల పెరుగుదల వంటి ఆరు ప్రశ్నలపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ కూటమి తప్పుపట్టింది. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయట్లేదంటూ మోదీని 'వలస పక్షి' అని సంబోధించింది.
'గత ప్రభుత్వాల వల్లే అసోం వెనుకబడింది'
" మేము మోదీకి ఆరు ప్రశ్నలు సంధించాం. వాటిలో కనీసం ఒక్కదానికైనా సమాధానం ఇస్తారని ఆశించాం. దురదృష్టవశాత్తు అతను అలా చేయలేదు."
- రిపున్ బోరా, ఏపీసీసీ అధ్యక్షుడు
అప్పుడెందుకు రాలేదు?
మోదీ కేవలం 'వలస పక్షి' లాంటివాడు కాబట్టే.. పర్యటకునిలా వచ్చి రాష్ట్రాన్ని సందర్శించి తిరిగి వెళ్లిపోతారని రాజ్యసభ ఎంపీ బోరా ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగేవరకు అసోంకు వస్తూనే ఉంటానని మోదీ చెప్పారు.. మరి రాష్ట్రం వరదలతో బాధపడుతున్నప్పుడు ఆయన ఎందుకు రాలేదని బోరా ప్రశ్నించారు. అలాగే 2019 డిసెంబర్లో సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో పోలీసులు ఐదుగురు యువకులను కాల్చి చంపినప్పుడు ఎందుకు రాలేదని సూటీగా ప్రశ్నించారు బోరా. ఇక ఉల్ఫా(ఐ) ఉగ్రవాదులు ఇద్దరు ప్రభుత్వరంగ ఉద్యోగులను అపహరించిన ఘటనలోనూ మోదీ మౌనం వహించడాన్ని తప్పుపట్టారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..
2001 నుంచి అసోంలో 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాబోయే ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా పోరాడేందుకు మేధావుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) అంచాలిక్ గణ మోర్చా(ఎజీఎం)లను కలుపుకొని 'గ్రాండ్ అలయన్స్' పేరిట కూటమిని ఏర్పాటు చేసింది.
''గ్రాండ్ అలయన్స్‌కు భయపడే మోదీ సహా.. ఇతర భాజపా జాతీయ నేతలు పదేపదే అసోంలో పర్యటిస్తున్నారు.''
-మంజిత్ మహంత, ఏజీఎం వర్కింగ్ ప్రెసిడెంట్
జనవరి 23 నుంచి ఇప్పటివరకూ అసోంలో వివిధ ప్రాజెక్టుల అమలు కోసం అధికారిక కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మునిన్ మహంత గుర్తుచేశారు. ఇందులో భాగంగా శివసాగర్, ధేకియాజులి, శిలాపాథర్ సభలకు హాజరయ్యారని తెలిపారు.
" మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు అసోంని తరచూ సందర్శించడం 'గ్రాండ్ అలయన్స్' విజయమే. భాజపాకు ఓటమి భయం పట్టుకుంది."
- అమీనుల్ ఇస్లాం, ఏఐడీయూఎఫ్
అతిపెద్ద పార్టీగా కమలం..
126 మంది సభ్యులున్న అసోం శాసనసభకు మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2016 ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాలేదు. ప్రస్తుతం 60 మంది ఎమ్మెల్యేలతో భాజపా అతిపెద్ద పార్టీగా ఉంది. మిత్రపక్షాలైన అసోమ్ గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ సహా.. స్వతంత్రం ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులుండగా.. ఏఐయూడీఎఫ్‌కు 14 మంది శాసనసభ్యులు ఉన్నారు.
ఇదీ చదవండి: 'అసోం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'