వాతావరణ మార్పులపై జీ20సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులపై పోరాడటానికి సమగ్రవిధానాన్ని రూపొందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో ప్రసంగించారు. భారత్ పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవటమే కాక వాటిని మించిపోయిందని తెలిపారు.
మానవత్వం పరిఢవిల్లాలంటే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలని వివరించారు. శ్రమను ఉత్పత్తి కారకంగా మాత్రమే చూడకుండా ప్రతి కార్మికుడి గౌరవం మీద దృష్టి పెట్టాలన్నారు.
"వాతావరణ మార్పులపై పోరాడటంపై మనం దృష్టి సారించాలి. వాతావరణ మార్పులపై సమగ్రంగా, విస్తృతంగా, సంపూర్ణంగా పోరాడాలి. ప్రాచీన సంప్రదాయ జీవన విధానాల నుంచి ప్రేరణ పొందిన భారత్.. తక్కువ కార్బన్ వినియోగం, వాతావరణ స్థితిస్థాపక అభివృద్ధి పద్ధతులను అవలంబించింది. భారత్.. పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా.. వాటిని అధిగమించింది."
--జీ20సదస్సులో ప్రధాని మోదీ.
అభివృద్ధి చెందిన దేశాల అండ అవసరం
2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల వినియోగంలో లేని భూమిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మోదీ. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రయోగాలు, ఆవిష్కరణలకు ఇదే మంచి సమయమని తెలిపారు. అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయం లభిస్తే మొత్తం ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.