మహారాష్ట్ర.. మోహోల్ ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్ మానేకు వింత అనుభవం ఎదురైంది. సోషల్‌మీడియాలో ఆయన వాట్సాప్ నంబర్ సంపాదించిన ఓ వ్యక్తి.. వీడియో కాల్ చేశాడు. అనంతరం ఆ వీడియో కాల్‌ను రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.లక్ష ఇవ్వకపోతే అందరికీ పంపిస్తానని మెసేజ్ చేశాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ భరత్‌పుర్‌కు చెందిన రిజ్వాన్ అస్లాం ఖాన్.. ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్ వాట్సాప్ నంబర్‌ను సోషల్‌మీడియా ద్వారా సంపాదించాడు. అనంతరం ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. వాట్సాప్, ఫేస్బుక్లో అసభ్యకరమైన మెసేజ్‌లు కూడా పంపాడు. వాట్సాప్ వీడియో కాల్‌ను రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.లక్ష ఇవ్వకపోతే అందరికీ షేర్ చేస్తానని మెసేజ్ చేశాడు.
ఈ విషయంపై పుణెలో ఉంటున్న ఎమ్మెల్యే యశ్వంత్ విఠల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. రాజస్థాన్, భరత్‌పుర్‌లో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 90కుపైగా అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడికి ఐదు రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
"ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. నా వీడియో కాల్‌ను రికార్డ్ చేసి బెదిరించాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకుని దర్యాప్తు చేపడుతున్నందుకు నా అభినందనులు. తెలియని ఫోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయవద్దు. అనుమానం వస్తే సైబర్ పోలీసులను సంప్రదించండి."
-యశ్వంత్ విఠల్ మానే, ఎన్సీపీ ఎమ్మెల్యే