Mizoram Election Results 2023 : ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మూడున్నర దశాబ్దాలుగా వస్తున్న రాజకీయ సంప్రదాయాన్ని స్థానిక ఓటర్లు ఈసారి పక్కనపెట్టారు. 1989లో రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్‌లే పాలించిన రాష్ట్రంలో తొలిసారి 'జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM)'కు అధికారాన్ని అప్పజెప్పారు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో 27 సీట్లతో ZPM జయకేతనం ఎగురవేసింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ పది స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైంది.
పార్టీ పేరు | గెలిచిన సీట్లు |
ZPM | 27 |
MNF | 10 |
BJP | 02 |
కాంగ్రెస్ | 01 |
ప్రభుత్వ ఏర్పాటుకు జెడ్‌పీఎం సిద్ధం!
Mizoram New CM : మిజోరంలో విజయం సాధించిన 'జోరం పీపుల్స్ మూవ్‌మెంట్' పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె సప్దంగా తెలిపారు. సెర్చిప్‌లో ఉన్న జెడ్‌పీఎం నాయకుడు లాల్‌దుహోమా.. సోమవారం మధ్యాహ్నం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కలవనున్నట్లు ఆయన చెప్పారు. లాల్‌దుహోమా సెర్చిప్ స్థానంలో పోటీ చేసి తన సమీప ఎంఎన్‌జే అభ్యర్థిపై దాదాపు 3వేల ఓట్లతో గెలుపొందారు.
ఎవరీ లాల్‌దుహోమా?
Who Is Lalduhoma : ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరదించుతూ జెడ్పీఎంకు అధికారాన్ని కట్టబెట్టిన నేతగా లాల్‌దుహోమా పేరు ఇప్పుడు మిజోరంలో మార్మోగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన లాల్‌దుహోమా ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి. ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన లాల్‌దుహోమా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పతనాలు చవిచూశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రెండుసార్లు అనర్హతకు కూడా గురయ్యారు. గెలుపోటములను తట్టుకున్నారు. ఎట్టకేలకు మిజోరంలో 1989 నుంచి వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరదించుతూ జడ్పీఎంను అధికారానికి చేరువ చేశారు. మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
'ఊహించని రీతిలో ఫలితాలు.. కానీ'
Mizoram Election 2023 BJP : మిజోరం ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ వన్‌లాల్‌ముకా తెలిపారు. "రాష్ట్రంలో హంగ్ వస్తుందని ఊహించాం. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. ఊహించని రీతిలో ఉన్నాయి. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. ప్రధాని మోదీ, జేపీ నడ్డా నాయకత్వంలో మిజోరం అభివృద్ధి చెందుతోంది. 2018లో ఒక్క చోటే గెలిచాం. ఇప్పుడు రెండు చోట్ల విజయం సాధించాం" అని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రాజీనామా..
Mizoram CM Resigns Today : 2023 ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ పరాజయం పాలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జోరంథంగా రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఐజ్వాల్ తూర్పు-1 నుంచి పోటీ చేసిన జోరంథంగా.. జెడ్‌పీఎం అభ్యర్థి లాల్తన్సంగా చేతిలో 2100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుయ్‌చాంగ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తాన్‌లుయా.. జెడ్‌పీఎం అభ్యర్థిపై 909 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే జోరం పీపుల్స్ మూవ్‌మెంట్- ZPM మిజోరంలో అధికారాన్ని కైవసం చేసుకుంది.
-
#WATCH | Aizawl: Mizoram CM Zoramthanga tenders his resignation to Governor Dr Hari Babu Kambhampati at Raj Bhavan. pic.twitter.com/nXtuZgCmJh
— ANI (@ANI) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Aizawl: Mizoram CM Zoramthanga tenders his resignation to Governor Dr Hari Babu Kambhampati at Raj Bhavan. pic.twitter.com/nXtuZgCmJh
— ANI (@ANI) December 4, 2023#WATCH | Aizawl: Mizoram CM Zoramthanga tenders his resignation to Governor Dr Hari Babu Kambhampati at Raj Bhavan. pic.twitter.com/nXtuZgCmJh
— ANI (@ANI) December 4, 2023
Mizoram Election 2023 : మిజోరంలో నవంబర్ 7వ తేదీన పోలింగ్ నిర్వహించగా, రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంఎన్‌ఎఫ్, జెడ్‌పీఎం, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మిజోరంలో తొలిసారి నాలుగు స్థానాల్లో పోటీ చేసింది.