భాజపా వర్గాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా.. తమిళనాట పార్టీ విషయాలు చక్కబెడుతున్నారు. అధికార అన్నాడీఎంకే పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో... స్వయంగా రంగంలోకి దిగారు. పొత్తును తిరిగి పట్టాలెక్కించారు. అయితే, ఎన్నికలకు కొన్ని నెలలే సమయమున్న నేపథ్యంలో పార్టీ గంపెడాశలు పెట్టుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ మద్దతు, డీఎంకే మాజీ నాయకుడు ఎంకే అళగిరి చేరిక ప్రస్తుతానికి మీమాంసలోనే ఉన్నాయి.
అమిత్ షా పర్యటన...
అన్నాడీఎంకేతో పొత్తుకు గండిపడ్డ నేపథ్యంలో.. తిరిగి గాడిన పెట్టేందుకు పూనుకున్న అమిత్ షా చెన్నైలో రెండు రోజులు పర్యటించారు. పొత్తు చర్చలు సత్ఫలితాలిచ్చినా.. రజినీకాంత్, అళగిరి.. అమిత్ షాకు హ్యాండిచ్చారు. కీలక నేతకు.. ఇరువురితో సమావేశం ఏర్పాటు చేద్దామనుకున్న భాజపా నేతలకు నిరాశే ఎదురైంది. అమిత్ షాతో సమావేశానికి సూపర్‌స్టార్ విముఖత వ్యక్తం చేయగా .. భాజపా ఆహ్వానాన్ని డీఎంకే బహిష్కృత నేత అళగిరి తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.
సూపర్‌స్టార్ మద్దతు !
రజినీకాంత్ మద్దతుతో తమిళనాట ఎన్నికల్లో సత్తాచాటాలని భాజపా ఊవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో సూపర్‌స్టార్ సమావేశమవుతారని చెన్నై వర్గాలు కోడైకూశాయి. అయితే, ఈ భేటీ గతంలోలాగే ఇప్పుడు కూడా ఊహాగానాలకే పరిమితమైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని భావిస్తోన్న కాషాయదళం.. రజినీ అండ పార్టీని అందలం ఎక్కిస్తుందని బలంగా విశ్వసిస్తోంది. ఆయన రాజకీయ పార్టీ స్థాపనపై మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితుల్లో.. సూపర్‌స్టార్ ఫాలోయింగ్‌ను ఓట్లుగా మల్చుకోవాలని భాజపా ఆశపడుతోంది.
ఇదీ చూడండి: తమిళనాడుకు అమిత్ షా.. రజనీకాంత్‌తో భేటీ!
రజినీతో భేటీ కాకపోయినా... ఆయన సన్నిహితుడు 'తుగ్లక్' మ్యాగజైన్ ఎడిటర్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయిన ఎస్ గురుమూర్తితో అమిత్ షాతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. గత వారం రజినీకాంత్ గురుమూర్తితో భేటీ అయిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోపక్క రజినీకాంత్ సహచరుడు కమల్‌హాసన్ పట్ల కూడా భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది. కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం పార్టీతో ప్రజల్లోకి వచ్చారు. ఆయన భాజపా సిద్ధాంతాలకు ఆమడ దూరంలోనే ఉన్నారు.
ఆళగిరి దారెటు ?
కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి విషయంపై.. భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. సమయం సందర్భం దొరికినప్పుడల్లా స్థానిక భాజపా నాయకులు ఆళగిరిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. కాషాయ కండువా కప్పుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఆయన చేరిక.. దక్షిణ జిల్లాల్లోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు.
మరోవైపు ఆళగిరి విధేయుడు, డీఎంకే బహిష్కృత నేత కేపీ రామలింగం అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. ఇక అళగిరి సైతం కాషాయ కండువా కప్పుకోవటం లాంఛనమేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ, ఎప్పుడనే అంశంపై స్పష్టత లేదు.
విశ్లేషకులు మాట
రాజకీయాల విషయంలో రజినీకాంత్ అంతుచిక్కని అడుగులు, అళగిరి వ్యూహాత్మక నిర్ణయాలు ఊహించినవే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అమిత్ షా చెన్నై పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఒంటి చేత్తో తమిళనాడులో విజయం సాధించలేమని భాజపాకు తెలుసు. వారికి అన్నాడీఎంకేతో అవసరముంది. ఈ పరిస్థితుల్లో పొత్తు పునరుద్ధరించటంలో అమిత్ షా సఫలీకృతమయ్యారు. అయితే, భాజపా రాష్ట్రంలో పీఎంకే, డీఎండీకే, టీఎంసీతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ప్రస్తుతానికి భాజపా దృష్టంతా రజినీకాంత్‌పైనే ఉంది. రజినీ ప్రజాకర్షణ శక్తి సాయంతో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాలన్నదే షా ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తంగా అమిత్ షా పర్యటన భాజపాకు కొత్త శక్తినిచ్చింది.
-డా. ఎస్ తిరునావుక్కరసు, ప్రొఫెసర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
ఇదీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!
ఇదీ చూడండి: 'ఎన్నికల్లో భాజపా- అన్నాడీఎంకే కూటమిదే విజయం'