minor rape Faridabad: అభంశుభం తెలియని ఏడాదిన్నర చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఈ ఘటన హరియాణా, ఫరీదాబాద్‌లోని షాపురా గ్రామంలో జరిగింది. 40 ఏళ్ల నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక తల్లి గట్టిగా కేకలు వేయడం వల్ల నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
బాలిక తల్లి బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
బీహార్‌లో మరో దారుణం: రెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానంటూ చిన్నారిని నమ్మించి ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులతో చుట్టుపక్కల వారు రావడం వల్ల నిందితుడు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం రోహ్తాస్ పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు.
సొంత మేనమామే: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సొంత మేనమామ. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌లో ఆదివారం జరిగింది. అత్యాచారం చేస్తున్న నిందితుడిని బాలిక తండ్రి పట్టుకున్నప్పటికీ ఆయనను నిందితుడు బెదిరించి పారిపోయాడు. బాలిక తల్లిని కొట్టాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
గిరిజన బాలికపై: బంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బాధితురాలు తన ప్రియుడితో కలిసి జాతరకు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు పంపగా.. మిగతా ఇద్దరిని స్థానిక కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీకి విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
10ఏళ్ల జైలు శిక్ష: ఒడిశాలోని కెందూఝర్ జిల్లా న్యాయస్థానం.. 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. 2017లో నేరానికి పాల్పడినట్లు తేల్చిన న్యాయమూర్తి సుభాశ్రీ త్రిపాఠి రూ.5,000 జరిమానా కూడా విధించారు. బాధితురాలికి రూ.4 లక్షలు పరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: దిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. విచారణకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి