15 ఏళ్ల బాలిక యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ తనకు తానుగా ప్రసవం చేసుకుంది. ప్రసవం తర్వాత ఆ శిశువును గొంతునులిమి చంపేసింది. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల బాలిక ప్రాణాలకూ ముప్పు వాటిల్లింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆమెను ఆస్పత్రిలో చేర్పించింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పుర్‌లోని అంబజారీ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 2న జరిగిందీ ఘటన. బాధితురాలు గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తాను గర్భం దాల్చానని తెలుసుకున్న బాలిక.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూసి తన డెలివరీకి కావాల్సిన సామాగ్రిని సర్దుబాటు చేసుకుంది. ఎప్పటిలానే బాధితురాలి తల్లి కూలి పనికి వెళ్లగా.. ప్రసవ వేదనకు గురైన ఆ బాలిక యూట్యూబ్ వీడియో చూసి స్వయంగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పసికందు గొంతునులిమి ప్రాణాలు తీసింది. శిశువు మృతదేహాన్ని ఓ పెట్టెలో దాచిపెట్టింది బాలిక. బాధితురాలి తల్లి ఇంటికి వచ్చేసరికి గదిలో మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి. దీంతోపాటుగా బాలిక ఆరోగ్యం కూడా క్షీణించి.. కదలలేని స్థితికి చేరుకుంది. దీంతో బాధితురాలి తల్లి బాలికను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వెల్లడించింది.
అసలేం జరిగిందంటే..?
15 ఏళ్ల వయసున్న బాధితురాలు ప్రస్తుతం 9వ తరగతి చదవుతోంది. ఆమెకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఏక్ ఠాకూర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్ని రోజుల పాటు వీరిద్దరూ ఛాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది. దీంతో నిందితుడు తొమ్మిది నెలల క్రితం.. బాధితురాలిని ఓ చోట కలవాలని ఆహ్వానించగా ఆమె అక్కడకు వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు బాలికను తన స్నేహితుల రూమ్‌కు తీసుకువెళ్లి.. అక్కడ ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. అయితే తన గర్భం గురించి ఇంట్లో తెలియకుండా ఆమె జాగ్రత్తపడి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి వాగ్మూలం ప్రకారం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడి పూర్తి పేరు కూడా ఆ బాలికకు తెలియదని విచారణలో తెలింది. దీంతో సైబర్ సెల్ సహాయం తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నవజాత శిశువు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.