Roads as Hema Malini cheeks: మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్గావ్ జిల్లాలోని తన నియోజకవర్గంలోని రోడ్లను నటి హేమా మాలిని బుగ్గలతో పోల్చారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటిల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Viral video of gulab rao patil: బోధ్వాడ్ నగర్ పంచాయత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాటిల్.. శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో తన నియోజకవర్గానికి వచ్చి రోడ్లను చూడాలని ప్రతిపక్షాలను ఆయన పిలవడం వినిపించింది.
Maharashtra Jalgaon news: "30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు... నా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడి రోడ్లను చూడండి. అవి హేమా మాలినీ బుగ్గల్లా లేకపోతే... నేను రాజీనామా చేస్తాను" అని గులాబ్రావ్ పాటిల్ అన్నారు. మాజీ భాజపా నేత, జల్గావ్ ఎమ్మెల్యే ఏక్నాథ్ ఖాడ్సే లక్ష్యంగా పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాటిల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చకాంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై క్షమాపణలు చెప్పకపోతే... లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
క్షమాపణలు...
అయితే.. మహిళా కమిషన్ హెచ్చరించిన కొన్నిగంటల తర్వాత పాటిల్ క్షమాపణలు చెప్పారు. ధూలేలో విలేకరుల సమావేశంలో పాటిల్ మాట్లాడుతూ... "నేను ఎవరినీ బాధపెట్టలేదని భావించలేదు. నా వ్యాఖ్యలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ సిద్ధాంతాలను పాటించే శివసేన పార్టీకి చెందిన నేతను నేను. మా పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మాకు మహిళలను గౌరవించాలని బోధించారు" అని చెప్పారు.
గతనెలలో.. రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ నేత రాజేంద్ర సింగ్ గుడా సైతం ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాల రహదారులు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చూడండి: ఈ మ్యూజియం.. అరుదైన నాణేల కొలువు.. ఆర్థిక చరిత్రకు నెలవు!