జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని సుయి గ్వారి వద్ద ఓ మినీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 14 మంది గాయపడ్డారు.
తాత్రి నుంచి దోడాకు వెళుతున్న క్రమంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అనంతరం స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే బస్సు లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు. ఘటనలో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
మొత్తం 25 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. 9 మంది అప్పటికే మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
మోదీ స్పందన..
జమ్ముకశ్మీర్లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు.
ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను దోడా ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:- ప్రయాణంలోనే మహిళ ప్రసవం- వెనక్కి తిరిగొచ్చిన రైలు