Military Nursing Service Women Quota : మిలిటరీ నర్సింగ్ సర్వీసుల్లో మహిళలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఇండియన్ మిలటరీ నర్సింగ్ సర్వీసెస్ ఆర్డినెన్స్-1943లోని సెక్షన్ 6లో పేర్కొన్న 'మహిళ (if a woman)' అనే పదాన్ని హైకోర్టు ధార్వాడ్ బెంచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 16 (2) (లింగ వివక్ష), ఆర్టికల్ 21 (జీవించే హక్కు , వ్యక్తిగత స్వేచ్ఛ)లను ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు కర్ణాటక నర్సుల సంఘం, హుబ్బళ్లిలోని కేఎల్ఈ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఎమ్ పీరాపుర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అనంత రామ్‌నాథ్ హెగ్డే నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది.
'రాజ్యాంగం ప్రకారం మహిళలు ప్రత్యేక తరగతికి చెందుతారు అని చెప్పడం సమర్థనీయం. అయితే, లాజిక్ లేకుండా మహిళలకు 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వకూడదు. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు 1943లో ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రాజ్యాంగం ప్రకారం దీనిని ఆమోదించారు. తద్వారా రాష్ట్రపతి అనుమతి పొందింది. అయితే, ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 ప్రకారం పార్లమెంట్ రూపొందించిన చట్టంగా పరిగణించలేము' అని ధర్మాసనం పేర్కొంది.
'స్వాతంత్ర్యానికి ముందు సైన్యంలో చేరడానికి మహిళలు ఇష్టపడేవారు కాదు. అందుకే మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా వారికి 100 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే 1943లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచాయి. అయితే రిజర్వేషన్ కల్పించే లక్ష్యాలు ఏమిటో ఇప్పటికే సరైన కారణాలు చెప్పలేదు. కాబట్టి ఈ రిజర్వేషన్ సదుపాయం సమర్థనీయం కాదు' అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పిటిషనర్లు సవాల్ చేసిన రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయిందని ధర్మాసనం తెలిపింది. కాబట్టి పిటిషనర్లను ఆర్మీ నర్సులుగా నియమించాలని ఆదేశించడం సాధ్యం కాదని కోర్టు వివరించింది.
ఇదీ కేసు!
సైన్యంలో నర్సుల నియామకానికి సంబంధించి 2010 ఫిబ్రవరి 13, 19 తేదీల్లో ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో "భారతీయ పౌరులై ఉండి, 21 ఏళ్లు పైబడిన మహిళలు ఇండియన్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్‌లో అధికారిగా నియామకానికి అర్హులు. సూచించిన షరతులను సంతృప్తి పరిస్తే నియమకం కావచ్చు" అని పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ఆర్డినెన్స్, 1943లోని సెక్షన్ 6లోని 'ఒక మహిళ' అనే పదాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు.
చనిపోయిన కుమార్తెలకు వారసత్వ ఆస్తిలో సమాన హక్కు : హైకోర్టు
రైల్వే ఉద్యోగికి ఒకరి కంటే ఎక్కువ భార్యలు- అందరూ పెన్షన్‌కు అర్హులే: హైకోర్టు