Military Chopper Crash: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 13మందికి పలువురు నివాళులు అర్పించారు. గురువారం ఉదయం వారి భౌతికకాయాలతో కూడిన శవపేటికలను జాతీయ జెండా కప్పి పూలతో అలంకరించిన సైనిక వాహనంలో వెల్లింగ్టన్‌లోని సైనిక ఆస్పత్రి నుంచి మద్రాస్ రెజిమెంటల్ కేంద్రానికి తరలించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంపీ సామినాథన్, కె.రామచంద్రన్, సీనియర్ ప్రభుత్వ, పోలీసు అధికారులు, సైనికాధికారులు బిపిన్ రావత్‌సహా 13మందికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం రావత్ దంపతుల భౌతికకాయాలను మద్రాస్ రెజిమెంటల్ కేంద్రం నుంచి సూలూరు బేస్ క్యాంపునకు తరలించారు. అక్కడి నుంచి వాయుమార్గం ద్వారా దిల్లీకి తీసుకెళ్తారు.
Bipin Rawat funeral time
రావత్ అంత్యక్రియలు దిల్లీలో శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు బిపిన్ రావత్ నివాసం వద్ద ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. దిల్లీ కంటోన్మెంట్‌లో బిపిన్ రావత్ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కామాక్షి ఆలయంలో మోక్షదీపం..
బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో మోక్షదీపం వెలిగించారు. కాంచీ కామకోటి పీఠం ఈ విషయాన్ని వెల్లడించింది. సీడీఎస్ మరో 12మంది మరణం అత్యంత విచారకరమని పేర్కొంది. వారిని కోల్పోవడం దేశానికి పెద్ద నష్టం అని తెలిపింది.
ఇదీ చదవండి: హెలికాప్టర్ క్రాష్‌పై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు: రాజ్‌నాథ్