దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకనుంచి 'పీఎం పోషణ్' (ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్)గా (PM POSHAN scheme) పిలవనున్నారు. ఈ పథకంలో ప్రీ ప్రైమరీ తరగతుల చిన్నారులు సైతం భాగం కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం కోసం (Mid day meal scheme budget).. 2021-22 నుంచి 2025-26 కాలానికి కేంద్రం రూ.54061.73 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31733.17 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెల్లడించారు. ఆహార ధాన్యాల కోసం కేంద్రం అదనంగా రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. దీంతో పథకం మొత్తం వ్యయం రూ. 1,31,794.90 కోట్లు అవుతుందని తెలిపారు. పథకాన్ని ప్రీప్రైమరీకి విస్తరించడం వల్ల వల్ల 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల విద్యార్థులకు మేలు కలగనుందని తెలిపారు.
యువతకు ప్రయోజనం: మోదీ
పీఎం పోషణ్ పథకం పోషకాహార లోపంపై పోరాటంలో కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. పోషకాహార లోపాన్ని కట్టడి చేయడానికి సాధ్యమైనవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ పథకంపై కేబినెట్ తీసుకున్న నిర్ణయం కీలకమైనదని అన్న ఆయన.. భారత్‌లోని యువతకు ఇది ప్రయోజనం చేకూర్చుతుందని చెప్పారు.
పీఎం పోషణ్‌తో వచ్చే మార్పులు..
- పీఎం పోషణ్‌లో భాగంగా 'తిథి భోజన్'అనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇందులో భాగంగా పండగలు, ప్రత్యేక రోజుల్లో.. విద్యార్థుల కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసేలా స్థానికులను భాగస్వామ్యం చేయనున్నారు.
- స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్ పేరిట.. పాఠశాలల్లోనే గార్డెనింగ్ చేపడతారు. విద్యార్థులకు అదనపు మైక్రోన్యూట్రియెంట్లు అందించే మొక్కలను గార్డెన్లలో పెంచుతారు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా స్కూళ్లలో స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్ అమలవుతోంది.
- అన్ని జిల్లాల్లో సోషల్ ఆడిట్ పథకం తప్పనిసరి కానుంది.
- అనీమియా అధికంగా ఉన్న జిల్లాల్లోని విద్యార్థులకు అదనపు పోషకాలు ఉన్న ఆహారం అందించేందుకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారు.
- గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంటల పోటీలు నిర్వహిస్తారు. స్థానికంగా లభించే వస్తువులు, కూరగాయలతో కొత్త, సంప్రదాయ వంటకాలు తయారు చేసేలా ప్రోత్సహిస్తారు. రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళల స్వయం సహాయక బృందాలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు.
ఇదీ చదవండి: స్టాక్ ఎక్స్చేంజీలో ఈసీజీసీ లిస్టింగ్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్