మహారాష్ట్ర.. పుణెలోని నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమవ్వడం.. స్థానికంగా కలకలం రేపింది. ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కుటుంబసభ్యుల్లో ఒకరు వీరందరిని నదిలో పడేసి చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 18 నుంచి 22వ తేదీల మధ్యలో.. పుణె నదిలో నాలుగు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పుణె నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని దౌండ్ ప్రాంతంలో ఉన్న భీమానదిలో మరో మూడు మృతదేహాలు ఉన్నాయని స్థానికులు.. పోలీసులకు సమచారమిచ్చారు. మొత్తం ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే వీళ్లంతా మరఠ్వాడా ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిగా పోలీసులు గుర్తించారు. మృతులను మోహన్ పవార్, అతడి భార్య సంగీత, వారి కుమార్తె రాణి, అల్లుడు శ్యామ్, ముగ్గురు మనమలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. నివేదికలో వీరంతా నీట మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరిది ఆత్మహత్య కాదని, ఎవరైనా వీరిని నదిలో పడేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వాటర్ హీటర్ వల్ల కరెంట్ షాక్.. భార్యాభర్తలు మృతి
మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. వాటర్ హీటర్ వల్ల విద్యుత్ షాక్‌కు గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. మృతులను ధ్యానేశ్వర్, అతడి భార్య సింధూబాయిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పింపాల్‌గావ్ గ్రామంలో ధ్యానేశ్వర్ కుటుంబం నివాసం ఉంటోంది. వారు స్థానికంగా మార్కెట్లకు వెళ్లి హోటల్ వ్యాపారం చేస్తూ కడుపు నింపుకుంటుంటారు. ఆ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు లేచి బాత్రూమ్లో వాటర్ హీటర్‌ను ఆన్ చేశాడు ధ్యానేశ్వర్. భార్యను స్నానం చేయమని చెప్పాడు. బాత్రూమ్కు వెళ్లిన సింధు ఒక్కసారిగా షాక్‌కు గురై స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ధ్యానేశ్వర్ కూడా షాక్‌కు గురయ్యాడు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు.
కారులో మైనర్‌పై గ్యాంగ్ రేప్
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో దారుణం జరిగింది. కారులో ఇంటికి తీసుకెళ్తామని చెప్పి పదో తరగతి చదువుతున్న ఓ మైనర్‌పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. సావ్నర్ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాధితురాలికి.. అదే ప్రాంతంలో ఉంటున్న అఖిల్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. అలా అప్పుడప్పుడు వారు కలుస్తుండేవారు. అయితే మంగళవారం సాయంత్రం.. బాధితురాలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో అఖిల్.. తన స్నేహితుడు పవన్‌తో కలిసి ఆమె దగ్గరకు కారులో వెళ్లారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని కారు ఎక్కమన్నారు. అది నిజమని నమ్మిన మైనర్.. కారు ఎక్కేసింది. వెంటనే కారులో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.
నీటి కుంటలో పడి ముగ్గురు బాలికులు మృతి
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా డియోలి ప్రాంతంలో విషాదం నెలకొంది. నీటి కుంటలో మునిగి ముగ్గురు బాలికలు మరణించారు. వారిలో కిరణ్, రియా అనే అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. బహిర్భూమికి వెళ్లిన తర్వాత గుంతలో జారిపడి చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.