వరుస ఓటములు చవిచూస్తున్న కాంగ్రెస్... వచ్చే ఏడాది జరిగే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఆశించిన ఫలితాలు సాధించి ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. అయితే ఎన్నికల్లో ఎవరితో జట్టు కట్టాలనే విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో విభేదిస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. వామపక్షాలతో పొత్తు కుదుర్చుకోవాలన్న రాహుల్ ప్రతిపాదనను వారు వ్యతిరేకిస్తున్నారు.
బంగాల్ కాంగ్రెస్ నాయకులతో శనివారం సుదీర్ఘంగా జరిగిన వర్చువల్ సమావేశంలో వామపక్ష కూటమితో పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు రాహుల్ గాంధీ. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని బంగాల్ కాంగ్రెస్ నాయకులకు స్పష్టం చేశారు. భాజపా, తృణముల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడి బంగాల్ ప్రజల మద్దతు మూటగట్టుకోవాలని పిలుపునిచ్చారు.
వామపక్షాలతో సీట్ల పంపకం విషయంపైనా రాహుల్ చర్చించినట్లు బంగాల్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీ నాయకులంతా రాహుల్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు పేర్కొన్నారు. అయితే సీనియర్ నేతలు మాత్రం సీట్ల పంపకం విషయంలో విభేదించినట్లు పేర్కొన్నారు.