Meenu Raheja The Shortest Lawyer: 'ధైర్యంగా పోరాడితే ఎవరైనా గమ్యస్థానాన్ని చేరుకోగలరు'.. హరియాణా, హిసార్‌కు చెందిన 'దేశంలోనే అత్యంత పొట్టి న్యాయవాది' మీను రహేజాకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. మీను రహేజా ఎత్తు 2 అడుగుల 9 అంగుళాలు మాత్రమే. కానీ తన కలల సౌధం ముందు వైకల్యం చిన్నదని నిరూపించింది ఆమె. తనలాంటి వారికి తోడుగా ఉంటూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
shortest lawyer in India: చూడటానికి మీను రహేజా చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆలోచనలు పెద్దవి. వైకల్యాన్ని ఎదిరించి చిన్నతనం నుంచే ఏదైనా సాధించాలని పట్టుదలతో జీవితంలో పోరాడింది. ఎంతో క్లిష్టమైన న్యాయవిద్యను చదివింది. కురుక్షేత్ర యునివర్సిటీ నుంచి 'లా' పట్టా పొందింది. ఈ క్రమంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఎన్నో అవమానాలను, అవహేళనలను మౌనంగా భరించింది. తన చేతలతోనే సమాధానం చెప్పింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
"ఐఏఎస్ అధికారిని కావాలనుకున్నాను. కానీ కాలేకపోయాను. నా ఎత్తు సమస్యగా మారింది. నా తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొంది న్యాయ విద్యను పూర్తి చేశాను. పేదవారికి, న్యాయం అవసరమైనవారికి ఉచితంగానే న్యాయ సహాయం చేస్తాను. వారి హక్కుల కోసం పోరాడతాను."
-మీను రహేజా, న్యాయవాది
పేదవారికి, తనలాగే వైకల్యంతో పోరాడేవారికి సాయం చేయడానికి మీను.. తన తల్లి కృష్ణ దేవి పేరు మీదుగా ఓ ఎన్జీఓను కూడా స్థాపించింది. సామాజిక సేవ చేస్తోంది. పేదల విద్యకు సహాయ పడుతోంది. దివ్యాంగులు, మహిళల హక్కుల కోసం న్యాయపోరాటంలో తోడుగా నిలుస్తోంది. శరీర దారుఢ్యం, రంగు, డబ్బులు, హోదాతో ఎవరూ గొప్పవారు కాలేరని చెబుతోంది. దివ్యాంగులకు సహాయం చేస్తే.. సమాజంలో అందరితో పాటు వారు కూడా వివిధ రంగాల్లో రాణిస్తారని అంటోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: కాళ్లు, చేతులు కట్టేసుకొని.. 5 గంటల్లో సముద్రాన్ని ఈదిన వృద్ధుడు