మెడికల్ ఆక్సిజన్ సరఫరా ఫిబ్రవరితో పోల్చుకుంటే ఏప్రిల్ నాటికి నాలుగింతలు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి చివరి వారంలో ఒక్కోరోజు 1,273 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా కాగా.. ఏప్రిల్ 17 నాటికి 4,739 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేసినట్లు పేర్కొంది. రైల్వే శాఖ మరికొన్ని రోజులు 'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్' రైళ్లను నడిపిస్తుందని తెలిపింది. ఈ రైళ్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.
పరిస్థితుల దృష్ట్యా.. దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్ తయారీ(ప్రెజర్ స్వింగ్) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. మరో 100 ప్లాంట్లను నెలకొల్పేందుకు ఆసుపత్రులను గుర్తిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ వినియోగం పెరిగిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్రామ్ భార్గవ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు