Media Council: పత్రికలు, ఎలక్ట్రానిక్/ డిజిటల్ ప్రసార మాధ్యమాల్లో అవ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి చట్టబద్ధ హక్కులతో 'మీడియా కౌన్సిల్'ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నేతృత్వంలోని ఈ సంఘం.. బుధవారం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. మీడియా కౌన్సిల్ నెలకొల్పడంపై ఏకాభిప్రాయ సాధనకు నిపుణులతో మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆరు నెలల్లోగా నివేదికను ఈ కమిషన్ అందించాలంది.
Media code of ethics: ప్రసార మాధ్యమాల నియంత్రణకు భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ), జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ ప్రమాణాల సంస్థ (ఎన్‌బీఎస్‌ఏ) వంటివి ఉన్నా వాటి ప్రభావం పరిమితమేనని స్థాయీ సంఘం పేర్కొంది. 'చెల్లింపు వార్త'లను ఎన్నికల నేరంగా పరిగణించే విషయంలో లా కమిషన్ సిఫార్సును త్వరగా అమల్లోకి తీసుకువచ్చేందుకు సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కృషి చేయాలని కోరింది. ఫోన్, ఇంటర్నెట్ సేవల్ని కొన్ని సందర్భాల్లో నిలిపివేసేటప్పుడు దాని ఔచిత్యాన్ని నిర్ణయించే యంత్రాంగం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. మొత్తం ఇంటర్నెట్‌ను నిలిపివేసే బదులు సామాజిక మాధ్యమాలను మాత్రమే నిషేధించే అవకాశం ఉంటే ఊరట లభిస్తుందని తెలిపింది.
- డిజిటల్ మాధ్యమాలు నైతిక నియమావళికి కట్టుబడి ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది.
- టీవీ ఛానళ్లపై వచ్చే ఫిర్యాదుల మీద నిర్ణయాలు తీసుకోవడంలో సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ అలసత్వం కనపరుస్తోందని తప్పుపట్టింది.
- 'దేశ వ్యతిరేక వైఖరి'కి కేబుల్ నెట్‌వర్క్ నిబంధనల్లో కచ్చితమైన నిర్వచనం ఉండాలంది.
ఇదీ చూడండి: పుతిన్ పర్యటనలో భారత్ ఏకే 203 రైఫిళ్ల ఒప్పందం!
ఇదీ చూడండి: 'దీదీ వెనుక మోదీ.. అందుకే కాంగ్రెస్ను బలహీనపరిచే యత్నం'