Indians evacuation from Ukraine: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చే భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. తమ సూచనలు జారీ అయిన తర్వాత ఇప్పటివరకూ 17వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. గత 24గంటల్లో 6 విమానాలు దిల్లీలో ల్యాండైనట్లు చెప్పారు. ఇప్పటివరకూ మొత్తం 15విమానాల ద్వారా 3,352 మంది స్వదేశం చేరినట్లు బాగ్చి వెల్లడించారు. మరో 24 గంటల్లో 15 విమానాలను షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్న ఆయన... వాటిలో కొన్ని ఇప్పటికే దారిలో ఉన్నట్లు ప్రకటించారు.
Russia Ukraine India
తూర్పు ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లు బాగ్చి పేర్కొన్నారు. గతరాత్రి కొంతమంది విద్యార్థులు ఖార్కివ్ నుంచి రైలు ద్వారా బయలుదేరారని తెలిపారు. చందన్ జిందాల్ అనే భారత విద్యార్థి ఉక్రెయిన్‌లో సహజ మరణం చెందినట్లు బాగ్చి పేర్కొన్నారు. అతని కుటుంబం కూడా అక్కడే ఉన్నట్లు చెప్పారు.
రష్యా సమాచారంతో అడ్వైజరీ..
ఉక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో ఉంటున్న తమ విద్యార్థుల భద్రతపై రష్యాతో మాట్లాడినట్లు బాగ్చి స్పష్టం చేశారు. రష్యా నుంచి అందిన సమాచారం మేరకు ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులకు అత్యవసర సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఖార్కివ్ నుంచి తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత పౌరులకు సూచించినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని లేకుంటే, కాలినడకన అయినా పశ్చిమప్రాంతాలకు వెళ్లాలని భారత విద్యార్థులు, పౌరులకు సూచించినట్లు తెలిపారు.
పాస్పోర్ట్ లేకున్నా...
పాసుపోర్టులు కోల్పోయిన వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు బాగ్చి వివరించారు. ఈ నిర్ణయం ఎంతోమంది భారత విద్యార్థులకు మేలు చేస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్నారని, ఆ వివరాలు చర్చలు జరిగినప్పుడు వెల్లడిస్తామని బాగ్చి తెలిపారు. ఇతర దేశాలకు సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రష్యా యుద్ధ ట్యాంకును ఎత్తుకెళ్లిన రైతు