పచ్చటి అందాలకు నెలవు తమిళనాడులోని కొడైకెనాల్. చుట్టూ టీ తోటలు, వాటి నడుమ సన్నటి దారి.. అలా ఎంత దూరం వెళ్లినా ఆ అందాలు మనల్ని వెంటాడుతున్నట్లే ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కొండలపై ఓ చూడ ముచ్చటైన ఇల్లు. దాని చుట్టూ వ్యవసాయ భూమి. ఆ ఇంట్లోనే ఉంటూ అక్కడ పంటలు పండిస్తుంటాడు ఆ యువకుడు. ఇదంతా మామూలే కదా అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ పొలంలో పంటలు పండిస్తున్న వ్యక్తి ఒక పోస్ట్‌గ్రాడ్యుయేట్. చేసేది కూడా సాధారణ వ్యవసాయం కాదు.
కొడైకెనాల్లో పండించే తేయాకు ఎంత ప్రత్యేకమో.. అక్కడ పండించే కూరగాయలూ అంతే ఫేమస్. అందుకే.. తిరుపత్తూర్‌కు చెందిన 26 ఏళ్ల నంద కుమార్ దృష్టి వీటిపై పడింది. చెన్నై అన్నా యూనివర్సిటీలో ఎంబీఏ చదివినా.. ఉద్యోగం వద్దనుకున్నాడు. వడకౌంజీ గ్రామంలో ఒక ఎకరా పంట పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో పండే పంటలతో పాటు అల్లం,ఉల్లి, బంగాళదుంపలు లాంటివి సాగు చేస్తూ అందరి చేత ఔరా అనిపిస్తున్నాడు. ఇతను సేకరించే పట్టు తేనె కూడా ఆ ప్రాంతంలో అంతే ఫేమస్.
పంటను అమ్మడంలోనూ వినూత్న పంథాను అనుసరిస్తున్నాడు నంద కుమార్. చుట్టుపక్కల గ్రామాల్లో ఆర్గానిక్ కూరగాయలు కావాల్సిన వినియోగదారులు అందరినీ వాట్సాప్ గ్రూప్ సహాయంతో ఏకం చేశాడు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని, వారి ఇళ్లకే సరకును డెలివరీ చేస్తున్నాడు.
నంద కుమార్ జీవన శైలి కూడా గమ్మత్తుగా ఉంటుంది. అతని ఇంటితో పాటు లోపల ఉండే సామాన్లు కూడా మట్టివి కావడం విశేషం. రోజంతా పొలం పనులతో బిజీబిజీగా ఉండే నంద కుమార్ చల్లని సాయంత్రం వేళ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడుపుతుంటాను అని చెబుతున్నాడు. మనతోపాటు ముందు తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలనే తాను ఈ చిన్న ప్రయత్నం చేశానని అంటున్నాడు నంద కుమార్. ఇలాంటి జీవన శైలిని తాను ఎంతో ఆస్వాదిస్తున్నాని ఆనందం వ్యక్తం చేశాడు. వ్యవసాయం మీద తనకున్న మక్కువే తనకు ఇలాంటి ఆలోచన కలిగేలా చేసిందని, తనలాంటి మరెందరో యువ రైతులను చూడాలని ఆకాంక్షిస్తున్నాడు.
ఇదీ చదవండి:
కళ్లు లేకున్నా కుటుంబానికి అండగా, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం, లక్షల్లో జీతం
80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్ రైడ్, బామ్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే