అందరికీ అన్నం పెట్టే రైతన్నలు హస్తిన సరిహద్దుల్లో బైఠాయించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేగానీ వెనుదిరిగి వెళ్లబోమంటూ భీష్మించారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు నెల రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఎముకలు కొరికే చలినీ లెక్క చేయట్లేదు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదాతల కోసం మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి. ఉచితంగా ఆహారం అందిస్తూ.. అంతర్జాల సదుపాయం కల్పిస్తూ.. అలసిన కాళ్లకు సాంత్వన కలిగించే ఏర్పాట్లు చేస్తూ.. వారి పోరాటానికి అండగా నిలుస్తున్నాయి. కొంతమంది వ్యక్తిగతంగానూ ఉడతా భక్తిగా తమకు తోచిన సహాయం చేస్తున్నారు. పోరు బాటలో రైతు ఒంటరి కాడని.. దేశమంతా వారి వెన్నంటి ఉందని తమ చర్యల ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల పోరాటానికి ఏయే రూపాల్లో ఎవరెవరు అండగా నిలుస్తున్నారో తెలుసుకుందాం..!
వ్యాయామశాలలు
పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో గ్రామాల్లోని వారిక్కూడా శారీరక దృఢత్వం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీక్షా శిబిరాల్లో ఉన్నవారు ఫిట్‌నెస్‌ని కోల్పోకుండా జిమ్‌లను ఏర్పాటు చేశారు పంజాబ్‌లోని జిరక్‌పూర్‌కి చెందిన సందీప్, దీప్ మాలిక్. వీరికి పంజాబ్‌లో ఎఫ్‌జెడ్ పేరుతో ఫిట్‌నెస్ జిమ్ చెయిన్ ఉంది.
వాషింగ్ మెషీన్లు
రోజుల తరబడి దీక్షా శిబిరాల్లో ఉండే రైతులు- తెచ్చుకున్న దుస్తులు అయిపోవడంతో స్థానికంగా ఉతుక్కునే అవకాశం లేక, సొంతూళ్లకు వెళ్లి ఉతికిన దుస్తులు తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో భారతీయ కిసాన్ యూనియన్‌కి చెందిన నలుగురు రైతులతోపాటు పంజాబ్, హరియాణాలకు చెందిన ఓ క్రీడాకారుల బృందంలోని సభ్యులు శిబిరాల దగ్గర వాషింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు రైతుల దుస్తుల్ని సేకరించి.. వారి పేరు, ఫోన్ నంబర్‌నూ తీసుకుంటున్నారు. ఆపై దుస్తుల్ని ఉతికి ఆరబెట్టి వారి గుడారం దగ్గరకే తీసుకెళ్లి ఇస్తున్నారు. ఇలా ఈ వాషింగ్ మెషీన్లు రోజుకి ఎనిమిది గంటలు నడుస్తున్నాయి. వీటికి నీటిని ట్యాంకర్లతో తెస్తున్నారు.
ఉచిత భోజనం
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో హస్తినలో, దాని సరిహద్దుల్లో ఉచితంగా భోజనాన్ని అందించేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. దిల్లీలోని మజ్ను కా తిలా గురుద్వారా, అమృక్ సుఖ్‌దేవ్ దాబా, ఖల్సా ఎయిడ్, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ పంజాబ్... ఇలా వేరు వేరు సంస్థలతోపాటు వ్యక్తులూ కర్షకులకు అన్నదానం చేస్తున్నారు.
ఉచిత వైఫై
అంతర్జాలం అందుబాటులో ఉంటే ఉన్నచోటు నుంచే ఫోనులో అన్నీ తెలుసుకోవచ్చు. అందుకే దిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సింఘు సరిహద్దులో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రైతులు దీక్ష పురోగతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశమూ కలుగుతోంది.
పైనాపిల్ పండ్లు
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు కేరళలోని ఓ రైతు సంఘం 16 టన్నుల పైనాపిల్ పండ్లను పంపింది. పైనాపిల్ నగరంగా పేరున్న వళకులం నుంచి పండ్లతో బయలుదేరిన ట్రక్కు సోమవారం సాయంత్రం దిల్లీకి చేరనుంది. పండ్లతోపాటు రవాణాకైన ఖర్చును పైనాపిల్ రైతులు భరిస్తుండటం గమనార్హం.
రోటీ మేకర్లు
సింఘు, టిక్రి సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతులే కాదు.. అక్కడున్న రోటీ మేకర్లు కూడా ఇప్పుడు అంతర్జాలంలో అందరి మనసుల్నీ గెలుచుకుంటున్నాయి. శిబిరాల దగ్గర మకాం వేసిన వేల మంది రైతులకు భోజనానికి ఇబ్బంది కలగకుండా ఓ సంస్థ ఈ రోటీ యంత్రాలను ఏర్పాటు చేసింది. అవి గంటకు 1,500 నుంచి 2,000 రోటీలను తయారుచేస్తున్న వీడియోలు నెట్‌లో వైరల్ అయ్యాయి.
ఫుట్ మసాజర్లు
దూర ప్రాంతాల నుంచి ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని దిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు రైతులు. వీరిలో వయసు పైబడినవాళ్లూ ఉన్నారు. అలాంటివారి పాదాలకు సాంత్వన అందించేందుకు గుడారాల్లోనే ఫుట్ మసాజ్ సెంటర్‌ని తెరిచింది ‘ద ఖల్సా ఎయిడ్ ఫౌండేషన్’. ‘‘రోజంతా దీక్షలో పాల్గొనడంతో పెద్ద వయసువారు కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అందుకే 25 యంత్రాలను అమర్చాం. ముందు ముందు ఇంకొన్ని తెస్తాం’’ అని చెప్పారు ఈ సంస్థ ఎండీ అమర్‌ప్రీత్. ఖల్సా ఫౌండేషన్ 400 వాటర్ ప్రూఫ్ టెంట్ హౌజ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, టీ, స్నాక్స్, పాయసం వంటి వాటినీ అందిస్తోంది.
చదువుకునేందుకు పుస్తకాలు
కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పుస్తకాల దుకాణాలు.. రైతులు-సామాజిక అంశాలు, మూడు వ్యవసాయ చట్టాల్లో లాభనష్టాలకు సంబంధించి చాలా పుస్తకాలను అందుబాటులో ఉంచాయి. వీటిలో కొన్ని పుస్తకాలను ఉచితంగా అందిస్తుంటే, మరికొన్ని అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి.
వైద్య శిబిరాలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సఫ్‌దర్‌జంగ్, హిందు రావ్... వంటి కొన్ని ఆసుపత్రులు దీక్షా శిబిరాల దగ్గర అయిదు చోట్ల వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశాయి. కరోనా భయాన్ని కూడా లెక్క చెయ్యకుండా వైద్యులు రైతులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
పిజ్జా లంగర్
రైతులతోపాటు విద్యావంతులు, యువత కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అలాంటివారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు వేర్వేరు యూనియన్లు కలసి పిజ్జా లంగర్‌ని ఏర్పాటు చేశాయి. సంప్రదాయ వంటశాలలకు అదనంగా ఏర్పాటు చేసిన వీటిలో పిజ్జాలను ఉచితంగా తినొచ్చు.