Manipur woman paraded : జాతుల మధ్య ఘర్షణలతో గత రెండున్నర నెలలుగా మణిపుర్ వణికిపోతోంది. తాజాగా వెలుగుచూసిన దారుణ ఘటన మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. కేవలం ఈశాన్య రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, పార్లమెంటు ఉభయ సభలతోపాటు సుప్రీంకోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
Manipur violence incident : మణిపుర్‌లో మే 3న రెండు తెగల మధ్య మొదట హింస చెలరేగింది. రెండు వర్గాల దాడులతో మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా ఉలిక్కిపడింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. ఇందులో భాగంగా తమ ఊరిపై కూడా వారు దాడి చేస్తారనే సమాచారంతో మే 4న బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె ఉండగా... మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు.
Manipur incident : సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో వారికి.. నాంగ్‌పోక్ సెక్‌మై వద్ద పోలీసులు కనిపించగా వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు 800 నుంచి వెయ్యి మందితో ఉన్న భారీ గుంపు బీ.ఫయనోమ్ గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురిని అడ్డగించింది. అనంతరం పోలీసుల దగ్గరి ఆయుధాలు లాక్కొని దాడికి పాల్పడింది. అందులోని యువకుడు తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ, సాయుధ మూకల దాడిలో అతడితోపాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
నగ్నంగా ఊరేగింపు.. ఆపై అత్యాచారం!
Manipur video : అనంతరం 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. ఇద్దరిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. గుర్తుతెలియని సాయుధ దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన నాంగ్‌పాక్ సెక్‌మై పోలీసు స్టేషన్‌కు మే 21న ఈ కేసును బదిలీ చేశారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో జులై 19న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
మణిపుర్‌లో మే 3 నుంచి ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం ఉండడం వల్లే ఇన్ని రోజులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాలేదని తెలుస్తోంది. తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం, వెంటనే వైరల్‌గా మారడం వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి హెరాదాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీడియోలో కనిపిస్తున్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రకటించారు. అయితే ఇంతటి దారుణంపై మే నెలలోనే కేసు నమోదు చేసినప్పటికీ రెండున్నర నెలలుగా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.