Manipur Violence News : ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మరోసారి హింస ప్రబలింది. తెగల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న ఆ రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బిష్ణుపుర్ జిల్లాలోని తమనాపోక్పి వద్ద జరిగిన ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 8 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు కుకీ ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారిలో ఇద్దరు భద్రతా బలగాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు, రాష్ట్రంలో దోచుకున్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు మణిపుర్ పోలీసులు, కేంద్ర భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గత 24 గంటల్లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్‌పోక్పి, తౌబాల్, చురచంద్‌పుర్ ఇంఫాల్- పశ్చిమ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించి ఐదు ఆధునిక ఆయుధాలతో పాటు 31 రౌండ్ల మందుగుండు సామగ్రి, 19 పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.
Manipur Firing : ఆగస్టు 18వ తేదీన.. ఉఖ్రుల్ జిల్లాలో సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ గ్రామంపై ఈ దాడి జరిగిందని జిల్లా పోలీసు అధికారి ఎన్ వాషుమ్ తెలిపారు. ఆ రోజు ఉదయం 4.30 గంటల సమయంలో సాయుధ మూకలు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాయని వెల్లడించారు. ఈ ఘటనలో తోవాయి గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోయారని చెప్పారు.
కాల్పుల సమాచారం నేపథ్యంలో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. వారంతా 24 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారని పోలీసులు తెలిపారు. పదునైన కత్తులతో హత్య చేశారనీ.. చంపడానికి ముందు అవయవాలను నరికినట్లు పోలీసులు తెలిపారు. హింస నేపథ్యంలో గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడ్డవారిని గుర్తించి, పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని ఎస్పీ వాషుమ్ వెల్లడించారు.