కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆటోలో వెళ్లిన ప్రయాణికుడే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు.. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేంద్ర సంస్థలతో కలిసి ముమ్మరంగా శోధిస్తున్నారు. ప్రెజర్ కుక్కర్‌లో డిటోనేటర్లు, వైర్లు, బ్యాటరీలు ఉన్నాయని.. ఆ పేలుడు ధాటికి ఆటో మెుత్తం కాలిపోయినట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణించిన వ్యక్తి వద్ద దొరికిన ఆధార్ కార్డు నకిలీదని గుర్తించిన పోలీసులు.. అసలు వ్యక్తి హుబ్బళ్లి వాసిగా తేల్చారు. అతడిని విచారణ జరపగా.. తన ఆధార్ కార్డు పోయిందని.. వారితో తనకు ఏ సంబంధం లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
తమ కుమారుడు ఉగ్రవాది కాదని అమాయకుడని.. ఈ బాంబు పేలుడుకు అతడికి ఎలాంటి సంబంధం లేదని అతడి తల్లి తెలిపింది. 6 నెలల క్రితం తమ కుమారుడి ఆధార్ కార్డు పోయిందని తండ్రి వెల్లడించారు. తమ కుమారుడిని పోలీసులు విచారించారని వారు తెలిపారు. శనివారం తమ కుమారుడి పుట్టినరోజు అని.. ఆ రోజు ఇలా జరిగిందని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తమ్ముడు గోల్డ్ మెడలిస్ట్ అని.. ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడని అతడి సోదరుడు తెలిపాడు.
ఘటనకు ముందు నిందితుడు వివిధ ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసులు గుర్తించారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఆ వ్యక్తి శివమొగ్గకు చెందిన వాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు సహా పలుచోట్లకు వెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు.. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన కారు పేలుడుకు.. ఈ ఘటనకు సంబంధాలపై ఆరా తీస్తున్నారు. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. స్పృహలోకి రాగానే విచారణ జరుపుతామని బొమ్మై తెలిపారు. భారీ ఉగ్రకుట్రను ఛేదిస్తామని సీఎం పేర్కొన్నారు. పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి కోయంబత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ జరిగింది
శనివారం సాయంత్రం మంగళూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడితోపాటు ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న ఆటోలో పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.