Mangalagiri MLA RK Resignation : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఎమ్మెల్యే రాజీనామాకు దారితీశాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి ఆర్‌కే రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేయడం సంచలనం రేపుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి ఆర్‌కే రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరానని మీడియాకు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తానని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వైసీపీ వర్గాల్లో సంచలనం రేపింది. పార్టీ పదవులతో పాటు, ప్రాధాన్యత విషయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల కొంతకాలంగా పార్టీ అధినాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో పంపిన రామకృష్ణారెడ్డి కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి, పెండింగ్ పనులు ఇంకా మరెన్నో కారణాలు రాజీనామా వెనుక దాగిఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉండగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయం పార్టీకి నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆదివారం ప్రారంభించారు. ఇద్దరు నేతలు కార్యాలయాలు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల కార్యాలయం ఉంది. అలాగే, తాడేపల్లిలో మరో రెండు కార్యాలయాలు అందుబాటులో ఉండగా తాజాగీ వేమారెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి ప్రారంభించడం విశేషం. కార్యకర్తలకు చేరువ కావడానికే కొత్త కార్యాలయం ప్రారంభించినట్లు చెప్తున్నా ఇరు వర్గాల మధ్య విభేదాలే కారణమని ఎమ్మెల్యే రాజీనామాతో స్పష్టమైంది.